బలమైన ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని తీసుకురావాలి   

A stronger SC / ST Act should be brought - Sakshi

అంబేడ్కర్‌ స్ఫూర్తితో ముందుకు సాగాలి

నేటికీ దళితులు వేధింపులకు గురవుతూనే ఉన్నారు.

చదువుకుంటేనే ధైర్యంగా పోరాడుతాం

మాలల ఆత్మీయ సమ్మేళనంలో ప్రభుత్వ సలహాదారు వివేక్‌

పరిగి (వికారాబాద్‌) : దళితులను వివక్ష, దాడుల నుంచి దూరం చేసేందుకు బలమైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరముందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జి. వివేక్‌ తెలిపారు. మంగళవారం పరిగిలోని కొప్పుల శారదా గార్డెన్‌లో అంబేడ్కర్‌ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాలల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

బలమైన ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని తీసుకురావాల్సిన బాధ్యత  కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రతి దళితుడు బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. నేటికి దళితులు వేధింపులకు, దాడులకు గురవుతూనే ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వివక్ష పోవాలంటే ప్రతి దళితుడు తమ పిల్లలను చదివించాలని సూచించారు. చదువుకున్న వ్యక్తులు మిగతా వారిని చదువకునేలా అవగాహన కల్పించాలన్నారు.

అంబేడ్కర్‌ జీవిత కాలంలో 23 డిగ్రీలు పొందారని ఆయన గుర్తు చేశారు. అనంతరం మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఎస్సీలు సంఘటితంగా ఉన్నప్పుడే తమ హక్కులు తాము సాధించుకోగలరని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. దళితుల అభ్యున్నతి కోసం తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. అంబేడ్కర్‌ చూపిన బాటలో అందరూ నడవాలని చెప్పారు.

ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అసెంబ్లీలో మొదటి ప్రసంగం అంబేడ్కర్‌ గురించే చేశానని ఆయన గుర్తు చేశారు.  అనంతరం రైతు సమన్వయ సమితి జిల్లా కో ఆర్డినేటర్‌ కొప్పుల మహేష్‌రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాలకు సమ న్యాయం చేస్తుందని తెలిపారు. దళితులు బాగుపడాలంటే చదువొక్కటే మార్గమని తెలిపారు. అక్షరాస్యత అందరి జీవితాల్లో వెలుగులు నింపుతుందని చెప్పారు.

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల కోసం 281 గురుకులాలు ఏర్పాటు చేసిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. దళితులు సంక్షేమ కార్యక్రమాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం వైఎస్సార్‌సీపీ ఎస్సీసెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రవికుమార్, రాష్ట్ర దళిత నాయకులు అద్దంకి దయాకర్, మందాల భాస్కర్, దేవదాస్‌ మాట్లాడుతూ.. దళితులు పోరాటాల ద్వారా తమ హక్కులు సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

విభజించి పాలించే కుట్రలను తిప్పి కొట్టాలన్నారు. అనంతరం అంబేడ్కర్‌ విజ్ఞాన వేదిక అధ్యక్ష, ప్ర«ధాన కార్యదర్శులు టీ. వెంకటయ్య, శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. తమ సామాజిక వర్గానికి ఎవరితోనూ శతృత్వం లేదని, తమ జనాభా ప్రాతిపదికన తమకు రావాల్సిన రిజర్వేషన్లు ఇవ్వాలని కోరారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లలో ఎస్సీ కార్పొరేషన్‌ రుణాల్లో తమ ప్రాధాన్యత తమకు ఇవ్వాలన్నారు.

అనంతరం నాయకులు మాలల రణభేరి సీడీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కరణం ప్రహ్లాద్‌ద్‌రావ్, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు కోళ్ల యాదయ్య, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ఎస్పీ బాబయ్య, ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు సురేందర్, సీనియర్‌ నాయకులు వెంకటయ్య, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top