ఆర్థిక చేయూతనివ్వండి | state ministe request for KTR Request to Central minister | Sakshi
Sakshi News home page

ఆర్థిక చేయూతనివ్వండి

Jan 21 2015 3:41 AM | Updated on Aug 30 2019 8:24 PM

ఆర్థిక చేయూతనివ్వండి - Sakshi

ఆర్థిక చేయూతనివ్వండి

నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నిధులు అందించి ఆర్థికంగా చేయూతనివ్వాలని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ మంత్రి కె.తారక రామారావు కేంద్ర మంత్రులను కోరారు.

కేంద్ర మంత్రులకు రాష్ట్ర మంత్రి కేటీఆర్ వినతి
సాక్షి, న్యూఢిల్లీ: నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నిధులు అందించి ఆర్థికంగా చేయూతనివ్వాలని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ మంత్రి కె.తారక రామారావు కేంద్ర మంత్రులను కోరారు. రాష్ట్రంలో చేపట్టనున్న పథకాలకు సాయం అందించాలని, మరికొన్ని సంస్థల ఏర్పాటుకు తోడ్పాటు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం కేటీఆర్ టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి రామచంద్రుడుతో కలసి కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, జౌళి శాఖ మంత్రి సంతోశ్ గంగ్వార్, గ్రామీణాభివృద్ధి మంత్రి భీరేంద్రసింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి సుజనా చౌదరిలతో వేర్వేరుగా భేటీ అయి వినతిపత్రాలు అందజేశారు. అనంతరం ఏపీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ కేంద్రమంత్రులతో భేటీ వివరాలను వెల్లడించారు.
 
వాటర్‌గ్రిడ్‌కు ఆర్థిక సాయం..
ఇంటింటికీ రక్షిత నీరు అందించే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.30 వేల కోట్లతో వాటర్ గ్రిడ్ పథకాన్ని ప్రారంభిస్తోందని, ఇందుకయ్యే వ్యయంలో సగభాగాన్ని కేంద్రం భరించాలని కేంద్ర మంత్రి భీరేంద్రసింగ్‌ను కోరినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.ఉపాధి హామీ పథకాన్ని కుదించరాదని, అవసరమైతే పనిదినాలను 100  నుంచి 150 రోజులకు పెంచాలని విజ్ఞప్తి చేశామన్నారు.

స్పందించిన కేంద్రమంత్రి ఉపాధిహామీ పథకానికి సంబంధించి ఆర్థిక ఏడాది చివరి త్రైమాసిక నిధులు రూ.223 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారని తెలిపారు. వెనుకబడిన జిల్లాలకు బీఆర్‌జీఎఫ్ కింద రాష్ట్రానికి రావాల్సిన రూ.228 కోట్లు వెంటనే విడుదల చేయాలని, రాష్ట్రానికి వచ్చే పింఛన్ కోటాను పెంచాలని కోరామని, దీనికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారన్నారు.
 
చేనేత క్లస్టర్లు ఏర్పాటు చేయమన్నాం..
సిరిసిల్లలో మెగా పవర్‌లూమ్ క్లస్టర్, దుబ్బాక, పోచంపల్లి, మహబూబ్‌నగర్‌లలో ఎక్కడైనా హ్యాండ్‌లూమ్ క్లసర్లు ఏర్పాటుచేయాలని జౌళి శాఖ మంత్రి సంతోశ్ గంగ్వార్‌ను కోరినట్టు కేటీఆర్ తెలిపారు. టీ-హబ్ ఇంక్యుబేషన్ సెంటర్‌కు మౌలిక వసతుల కల్పనకు సహకారం అందించాలని కేంద్రమంత్రి సుజానా చౌదరికి, సిరిసిల్లలో ఏర్పాటు చేయనున్న  ఈఎస్‌ఐ డిస్పెన్సరీని 200 పడకలకు అప్‌గ్రేడ్ చేయాలని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయకు విన్నవించామన్నారు.
 
కేంద్ర సహకారం ఉంటుంది: దత్తాత్రేయ
రాష్ట్రానికి అవసరమైన సాయాన్ని అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంటుందని కేంద్ర మంత్రి దత్తాత్రేయ పేర్కొన్నారు. తనతో కేటీఆర్ భేటీ అనంతరం దత్తాత్రేయ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు.
 
నేడు మహబూబ్‌నగర్‌కు కేటీఆర్
వాటర్‌గ్రిడ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు మంత్రి కేటీఆర్ బుధవారం మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. కల్వకుర్తి ప్రాజెక్టు వద్ద ఏర్పాటు  చేసే ఇంటేక్‌వెల్ సర్వే, డిజైన్లను ఆయన పరిశీలించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement