
రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం
రాష్ట్రంలో కార్మిక, రైతు వ్యతిరేక ప్రభుత్వ పాలన సాగుతోందని టీడీఎల్‌పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు.
టీడీఎల్‌పీ నేత ఎర్రబెల్లి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కార్మిక, రైతు వ్యతిరేక ప్రభుత్వ పాలన సాగుతోందని టీడీఎల్‌పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. టీడీఎల్‌పీ కార్యాలయంలో శుక్రవారం ఆయన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డితో కలసి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కార్మికులకు, రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని టీఆర్‌ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేదని అన్నారు. కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించే హామీని మేడే రోజైనా నిలబెట్టుకుంటారేమోనని భావించినా, నిరాశే ఎదురైందన్నారు.
రైతాంగాన్ని దగా చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ సాగించదన్నారు. రబీలో రైతులు కరెంటు ఉపయోగిం చుకోకపోతే మిగిలిపోయిన విద్యుత్‌ను తన ఘనతగా చెప్పుకుంటున్నారని అన్నారు. లాభసాటి వ్యవసాయం గురించి తెలుసుకునేందుకు మంత్రి పోచారం బృందం ఇజ్రాయెల్ వెళ్లేకున్నా కేసీఆర్ ఫాంహౌజ్‌కు వెళితే ఎకరాకు కోటి రూపాయలు ఎలా సంపాదించాలో తెలిసేదని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో తాగడానికి నీళ్లు ఇవ్వలేని ప్రభుత్వం వెయ్యి కోట్లతో ఇళ్లు కట్టిస్తానని చెప్పడం సిగ్గుచేటని మాగంటి గోపీనాథ్ విమర్శించారు.