చట్టంలో పలు మార్పులు చేసి కార్మికులకు ఉద్యోగ, వేతన భద్రతను పెంచామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు.
హైదరాబాద్: చట్టంలో పలు మార్పులు చేసి కార్మికులకు ఉద్యోగ, వేతన భద్రతను పెంచామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. కార్మిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో గురువారం ఏర్పాటుచేసిన మోదీ మూడేళ్ల సుపరిపాలన సదస్సులో కేంద్రమంత్రులు దత్తాత్రేయ, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ సనత్‌నగర్ ఈఎస్‌ఐ వైద్య కళాశాలలో కార్మికుల పిల్లలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. రామగుండంలో 100 పడకల ఆస్పత్రి, వరంగల్‌లో 50 పడకల ఆస్పత్రి నిర్మిస్తామని వెల్లడించారు. బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రభుత్వం కఠినమైన చట్టం చేసిందన్నారు. విద్యాహక్కు చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని స్పష్టం చేశారు.