
సాక్షి, హైదరాబాద్: మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్ కుమార్‌యాదవ్, ఎన్‌ఎఫ్‌ఐఆర్ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్యలు పేర్కొన్నారు. మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఆధ్వర్యంలో సోమవారం సౌత్ లాలాగూడ రైల్వే ఇన్‌స్టిట్యూట్‌లో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వినోద్ కుమార్ యాదవ్, మర్రి రాఘవయ్యలు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు.
చిన్న పిల్లల నుంచి మహిళల వరకు అనేక రకాలుగా హింసలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పని ప్రదేశాల్లోనూ మహిళలపై నిత్యం హింసలు జరుగుతున్నాయని తెలిపారు. వీటన్నింటిని అరికట్టడానికి మహిళలు సంఘటితంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మహిళలు తమ హక్కులను సాధించుకొని సమాజంలో మహిళ ఒక శక్తి అని నిరూపించుకోవాలని సూచించారు. కాగా, సోమవారం సికింద్రాబాద్ రైల్వే నిలయంలో వినోద్ కుమార్ అధికారులతో సమావేశమయ్యారు. రైల్వే భద్రతపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. రైల్వేలో భద్రతను పెంపునకు చర్యలు తీసుకోవాలన్నారు.
మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో..
మహిళలపై జరుగుతున్న హింసా వ్యతిరేక దినోత్సవాన్ని సోమవారం దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో మజ్దూర్ యూనియన్ ఎడ్యుకేషనల్ సెంటర్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సీహెచ్.శంకర్‌రావు, మహిళా కన్వీనర్ సరోజినిరెడ్డిలు హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం మహిళలపై వివక్ష కనబడుతోందన్నారు. పలు ప్రాంతాల్లో మహిళలపై హింసలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.