సోలార్‌  ప్లాంట్లు ఇవి నీటిపై తేలుతాయి!

Solar plants float on water - Sakshi

ఏర్పాటుకు ముందుకొచ్చిన సంస్థలతో ఇప్పటికే ప్రభుత్వం చర్చలు

28, 29న ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, లోయర్‌మానేరులలో సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఉన్నతాధికారుల పర్యటన

కాళేశ్వరం పరిధిలోని అనంతగిరి, రంగనాయక్‌సాగర్, కొండపోచమ్మసాగర్‌ల పరిధిలో ఏర్పాటుకు అవకాశాలు   

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మున్ముందు భారీగా పెరగనున్న విద్యుత్‌ డిమాండ్‌కు అనుగుణంగా విద్యుదుత్పత్తిని మరింత మెరుగుపరచుకునే అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా సోలార్‌ విద్యుత్‌ ఉత్పాదకతకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి రాష్ట్రంలో నీటితో ఉండే రిజర్వాయర్ల పరిధిలో సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణానికి అవకాశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తోంది. నీటిపై తేలియాడే సోలార్‌ పానెళ్ల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే దేశంలో పేరొందిన పలు సంస్థలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. కాళేశ్వరం పరిధిలోని ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, లోయర్‌మానేరు, అనంతగిరి, రంగనాయక్‌సాగర్, కొండపోచమ్మ సాగర్‌ల పరిధిలో వీటి ఏర్పాటుకు సంబంధించి ప్రస్తుతం పరిశీలన చేస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 28, 29న ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, లోయర్‌మానేరులలో సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఉన్నతాధికారులు పర్యటించి సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్నారు.  

కాళేశ్వరం బ్యారేజీలు, రిజర్వాయర్లే టార్గెట్‌.. 
రాష్ట్రంలో సోలార్‌ విద్యుదుత్పత్తి ప్రస్తుతం 3,700 మెగావాట్లకు చేరుకోగా, 2022 నాటికి 5వేల మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది. మరో అడుగు ముందుకేసి రిజర్వాయర్ల నీటిపై తేలియాడే సోలార్‌ప్లాంట్ల నిర్మాణంపై దృష్టి పెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో 141 టీఎంసీల సామర్ధ్యంతో బ్యారేజీలు, రిజర్వాయర్లు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మల్లన్నసాగర్‌ వంటి 50 టీఎంసీల రిజర్వాయర్‌తో పాటు 20 టీఎంసీల ఎల్లంపల్లి, 25 టీఎంసీల మిడ్‌మానేరు, 15 టీఎంసీల కొండపోచమ్మసాగర్‌ వంటి రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతోంది. గంధమల 9, బస్వాపూర్‌ 11 టీఎంసీల సామర్ధ్యంతో నిర్మాణం జరుగుతోంది. ఈ ప్రాజెక్టుల్లో వాటర్‌ స్ప్రెడ్‌ ఏరియా చాలా ఉంటోంది. ఈ ఏరియాను వినియోగించుకొని సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. రిజర్వాయర్‌లపై తేలియాడే సోలార్‌ ప్యానెళ్లను ఏర్పాటు చేయడం ద్వారా గణనీయంగా విద్యుత్‌ ఉత్పత్తి ఉంటుందని, ఇదే సమయంలో రిజర్వాయర్లలో ఆవిరి నష్టాలను నివారించవచ్చని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి.

నీటిపై తేలియాడే సోలార్‌ ప్యానెళ్లతో ఉత్పత్తయ్యే విద్యుత్, నాణ్యతతో పాటు పలు అంశాల్లో లాభదాయకంగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా భూమిపై సోలార్‌ ప్యానెళ్లను ఏర్పాటు చేసేందుకు ఖాళీ స్థలాలు అవసరమని, భారీ ప్లాంట్ల ఏర్పాటుకు ఖాళీ స్థలాల లభ్యత ఆషామాషీ వ్యవహారం కానందున, రిజర్వాయర్ల పరిధిలో సోలార్‌ ప్యానెళ్ల ఏర్పాటు ఆమోదయోగ్యమని అంటున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే పలు సంస్థలతో ప్రభుత్వం చర్చలు జరిపినట్లుగా తెలిసింది. అయితే కాళేశ్వరం పరిధిలో నది పరీవాహకంపై నిర్మిస్తున్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిధిలో ప్యానెళ్ల నిర్మాణం కష్టసాధ్యమని, ఇక్కడ భారీ వరదలు వచ్చినప్పుడు సోలార్‌ ప్యానెళ్లు కొట్టుకొనిపోయే ప్రమాదం ఉంటుందని నీటిపారుదల వర్గాలు అంటున్నాయి.

ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, లోయర్‌ మానేరు పరిధిలోనూ ఇదే సమస్య ఉంటుందన్నారు. అయితే అనంతగిరి, రంగనాయక్‌సాగర్, బస్వాపూర్, గంధమల, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్ల పరిధిలో మాత్రం వీటిని ఏర్పాటుచేసే వీలుంటుందని చెబుతున్నారు. అయితే వీటి నిర్మాణాన్ని ఏ విధంగా చేయాలన్న దానిపై పూర్తి స్థాయి అధ్యయనం జరగాల్సి ఉందని అంటున్నారు. కాగా రిజర్వాయర్ల పరిధిలో సోలార్‌ పానెళ్ల ఏర్పాటుకు సంబంధించి ఈ నెల 28, 29 తేదీల్లో సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, సింగరేణి కాలరీస్‌కు సంబంధించిన ఉన్నతాధికారులు మిడ్‌మానేరు, లోయర్‌ మానేరు, ఎల్లంపల్లిలో పర్యటించి నీటిపై తేలియాడే విద్యుత్‌ ప్లాంట్ల సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top