మాయ‘రోగుల’పై సస్పెన్షన్‌ వేటు!

17 మంది టీచర్లపై చర్యలు

వైద్యులకు షోకాజ్‌ నోటీసులు

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: టీచర్ల బదిలీల్లో అడ్డదారిలో అనారోగ్యం పేరిట ప్రిఫరెన్షియల్‌ పాయింట్లు పొందేందుకు ప్రయత్నించిన 17 మంది టీచర్లను సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ వెంకటేశ్వర్లు సస్పెండ్‌ చేశారు. తప్పుడు మెడికల్‌ సర్టిఫికెట్లు జారీచేసిన నలుగురు ప్రభుత్వ వైద్యులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

టీచర్ల బదిలీల మార్గదర్శకాలతో కూడిన జీవో 16ను ప్రభుత్వం ఈ నెల 6న విడుదల చేసింది. పూర్వపు మెదక్‌ జిల్లా పరిధిలో 8,269 మంది టీచర్లు దరఖాస్తు చేసుకున్నారు. ఎన్‌టైటిల్‌మెంట్‌ పాయింట్ల ఆధారంగా సీనియార్టీ జాబితా రూపొందించారు. అనారోగ్యాన్ని కారణంగా చూపుతూ 195 మంది టీచర్లు ప్రిఫరెన్షియల్‌ కేటగిరీలో అదనపు ఎన్‌టైటిల్‌మెంట్‌ పాయింట్లు కోరుతూ ఆన్‌లైన్‌లో మెడికల్‌ సర్టిఫికెట్లు దరఖాస్తుతో సమర్పించారు.  

పరిశీలనకు కలెక్టర్‌ ఆదేశం..
జిల్లా మెడికల్‌ బోర్డు జారీ చేసిన మెడికల్‌ సర్టిఫికెట్లపై ఫిర్యాదులు రావడంతో సంగారెడ్డి కలెక్టర్‌ పరిశీలనకు ఆదేశించారు. ఈ నెల 16, 18ల్లో 195 మంది టీచర్లు సమర్పించిన సర్టిఫికెట్లను కమిటీ పరిశీలించింది. çపరిశీలనకు 8 మంది టీచర్లు గైర్హాజరు కాగా, 14 మంది తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించినట్లు తేలింది. దీనిపై పరిశీలన జరిపిన సంగారెడ్డి డీఈఓ విజయలక్ష్మి కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు.

ఈ నివేదిక ఆధారంగా తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించిన 11 మందితో పాటు, పరిశీలనకు గైర్హాజరైన ఆరుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. తప్పుడు సర్టిఫికెట్లు జారీ చేసిన నలుగురు ప్రభుత్వ వైద్యులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

సస్పెన్షన్‌ వేటు పడిన వారిలో సంగారెడ్డి జిల్లా పరిధిలో ఆరుగురు, మెదక్‌ జిల్లా పరిధిలో ఏడుగురు, సిద్దిపేట జిల్లా పరిధిలో నలుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు. కౌన్సెలింగ్‌ ప్రక్రియను తప్పుదోవ పట్టిస్తూ, దురుద్దేశ పూర్వకంగా తప్పుడు మెడికల్‌ సర్టిఫికెట్లు సమర్పించినందునే ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేసినట్లు జిల్లా కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు ‘సాక్షి’కి వెల్లడించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top