రూ. 5 వేల కోట్లతో గొర్రెల పంపిణీ


గొర్రెలు, మత్స్యరంగాల అభివృద్ధి ఉపసంఘం సిఫారసు

4 లక్షల కుటుంబాలకు 84 లక్షల గొర్రెలు


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్న 4 లక్షల కుటుంబాలకు రూ. 5 వేల కోట్లతో 75 శాతం సబ్సిడీపై 84 లక్షల గొర్రెలను పంపిణీ చేయాలని గొర్రెలు, మత్స్యరంగ అభివృద్ధి కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు చేసింది. పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం సచివాలయంలో రెండోసారి సమావేశమైంది. ఈ ఉపసంఘంలో మంత్రులు ఈటల రాజేందర్, టి.హరీశ్‌రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, జగదీశ్‌రెడ్డి, జోగు రామన్న, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు సభ్యులుగా ఉన్నారు.


ఈ సమావేశానికి జూపల్లి మినహా సభ్యులంతా హాజర య్యారు. సభ్యులు పలు అంశాలపై చర్చించి ముఖ్యమంత్రికి సమర్పించనున్న నివేదికలో ఈ మేరకు సిఫారసు చేయనున్నారు. రాష్ట్రంలో 4 లక్షల యాదవ, కురుమ కుటుం బాలు ఉండగా... ఇందులో 2 లక్షల కుటుం బాలకు ఈ ఏడాది 20+1(20 గొర్రెలు, 1 గొర్రెపోతు) చొప్పున గొర్రెలను పంపిణీ చేయాలని మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు చేసింది. మిగిలిన 2 లక్షల కుటుంబాలకు వచ్చే ఏడాది పంపిణీ చేయాలని సూచించిం ది. లబ్ధిదారులు గొర్రెల పెంపకం సొసైటీల్లో సభ్యత్వం కలిగి ఉండాలని పేర్కొంది.  కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల నుండి గొర్రెల ను కొనుగోలు చేస్తారు.


కొనుగోలు చేసిన ప్రాంతంలోనే గొర్రెలకు ఇన్సూరెన్స్‌ ట్యాగ్‌ వేస్తారు. కిలోల లెక్కన ధరను నిర్ణయించా లని... లబ్ధిదారుల ఎంపికకు సరైన మార్గదర్శకాలు రూపొందించిన అనంతరం రాష్ట్రస్థాయిలో టెండర్లు పిలవాలని ఉపసంఘం స్పష్టంచేసింది. టెండర్‌ను దక్కించుకున్న వారే లబ్ధిదారుల గ్రామాలకు గొర్రెలను సరఫరా చేస్తారు. ఒక్కొక్క యూనిట్‌ ధర రూ. 1.25 లక్షలు. అసలు గొర్రెలు లేని వారికి మొదటి ప్రాధాన్యం ఇస్తారు.


మత్స్యశాఖపై జరిగిన చర్చలో భాగంగా సభ్యత్వ నమోదు... ఇతర అంశాలపై మంత్రివర్గ ఉపసంఘం పలు సూచనలు చేసింది. ఈ సమావేశంలో గొర్రెలు మేకల అభివృద్ధి సమాఖ్య చైర్మన్‌ కన్నెబోయిన రాజయ్యయాదవ్, పశుసంవ ర్ధకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేశ్‌చందా, మత్స్యశాఖ కమిషనర్‌ డాక్టర్‌ సువర్ణ, తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top