చేసేందుకు పనేం లేదని...

Senior IAS Akunuri Murali has applied for voluntary retirement - Sakshi

వీఆర్‌ఎస్‌కు ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళి దరఖాస్తు

పోస్టింగ్‌ల విషయంలో అసంతృప్తే కారణం  

సాక్షి, హైదరాబాద్‌: సీనియర్‌ ఐఏఎస్‌ ఆకునూరి మురళి స్వచ్ఛంద పదవీ విరమణకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని కలిసి శనివారం ఆయన వీఆర్‌ఎస్‌ దరఖాస్తును అందజేశారు. చేసేందుకు పని లేదనే కారణంతోనే వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నానని  ఆయన ‘సాక్షి’కి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రాజ్యాభిలేఖన, పరిశోధన సంస్థ (స్టేట్‌ ఆర్కివ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌) డైరెక్టర్‌గా ఏడాదిన్నరగా కొనసాగుతు న్నారు. ప్రాధాన్యతలేని పోస్టు కేటాయించారని గత కొంతకాలంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారు. పదవీ విరమణకు 10 నెలల ముందే వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకోవడం అధికారవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

2006 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆయన గతంలో సెర్ప్‌ సీఈఓగా, భూపాలపల్లి జయశంకర్‌ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌గా చేసిన సమయంలో స్థానిక అటవీ ప్రాంతంలోని గిరిజనుల్లో క్షయ వ్యాధి నిర్మూలన పట్ల అవగాహన కల్పించేందుకు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. గిరిజనుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు అడవి పంది, గొడ్డు మాంసం తినాలని ప్రోత్సహించే క్రమంలో ఆయన బ్రాహ్మణ సామాజికవర్గాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఆ వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ తర్వాత కొంత కాలానికి ప్రభుత్వం ఆయనను భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌ పదవి నుంచి స్టేట్‌ ఆర్కివ్స్‌కు బదిలీ చేసింది.

పోస్టింగ్‌ల కేటాయింపుల్లో దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ వర్గాల అధికారులకు అన్యాయం జరుగుతోందని, అధిక శాతం అధికారులు ప్రాధాన్యతలేని పోస్టుల్లో మగ్గిపోవాల్సి వస్తోందని కొంతకాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దళితవర్గానికి చెందిన ఆయన కొంత మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ఐఏఎస్‌లతో కలిసి శాసనసభ ఎన్నికలకు ముందు సీఎస్‌ ఎస్కే జోషిని కలిసి పోస్టింగ్‌ల విషయంలో తమ అసంతృప్తిని తెలియజేశారు. ఏడాదిన్నరగా ప్రభుత్వం తనకు కారును సైతం కేటాయించలేదని అసంతృప్తి వ్యక్తం చేసేవారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం డిజైనింగ్‌లో తీవ్ర లోపాలున్నాయని పేర్కొంటూ ఇటీవల∙ఆయన చేసిన వ్యాఖ్యలు సైతం చర్చనీయాంశమయ్యాయి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top