కలెక్టర్లుగా పనికిరామా?

Sc St IAS Candidates Request To CS SK Joshi - Sakshi

సీఎస్‌ వద్ద పలువురు ఎస్సీ, ఎస్టీ ఐఏఎస్‌ల ఆవేదన

పోస్టింగుల్లో అన్యాయం..అర్హతలున్నా ప్రాధాన్యత లేదు

అవకాశమిస్తే సామర్థ్యాన్ని నిరూపించుకుంటామని విజ్ఞప్తి

సాక్షి, హైదరాబాద్‌ : ఉద్యోగ జీవితంలో ఒక్కసారైనా జిల్లా కలెక్టర్‌గా పనిచేయాలని ప్రతి ఐఏఎస్‌ అధికారి కోరుకుంటారని.. కానీ సీనియారిటీ, అర్హతలు ఉన్నా కూడా తమకు ఆ అవకాశం రావడం లేదని రాష్ట్రానికి చెందిన పలువురు ఎస్సీ, ఎస్టీ ఐఏఎస్‌ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. తాము జిల్లా కలెక్టర్‌ పోస్టుకు పనికిరామా? అంటూ వాపోయారు. ఈ మేరకు బుధవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషిని కలసి తమ బాధను వెళ్లగక్కారు. పోస్టింగుల కేటాయింపుల్లో తమకు జరుగుతున్న అన్యాయాన్ని సీఎస్‌ దృష్టికి తీసుకెళ్లారు. జాయింట్‌ కలెక్టర్‌గా పనిచేసిన తమను కాదని, అనుభవం లేని జూనియర్‌ ఐఏఎస్‌లను జిల్లా కలెక్టర్లుగా నియమించారని వారు పేర్కొన్నట్టు తెలిసింది.

ఉమ్మడి రాష్ట్రంలో కనీసం 25 శాతం జిల్లాలకు ఎస్సీ, ఎస్టీ కలెక్టర్లను నియమించడం ఆనవాయితీగా ఉండేదని.. ప్రస్తుతం రాష్ట్రంలోని 31 జిల్లాల్లో కేవలం నాలుగు చోట్ల మాత్రమే ఎస్సీ, ఎస్టీ కలెక్టర్లు పనిచేస్తున్నారని వివరించినట్టు సమాచారం. ఎస్సీ, ఎస్టీ ఐఏఎస్‌లను సీనియారిటీతో సంబంధం లేకుండా అప్రాధాన్య పోస్టులకు పరిమితం చేస్తున్నారని, తక్కువ స్థాయి కలిగిన పోస్టుల్లో నియమిస్తున్నారని వాపోయినట్టు తెలిసింది. ఈ అంశాలన్నీ విన్న సీఎస్‌.. సమస్యలను వ్యక్తిగతంగా వినతిపత్రం రూపంలో అందజేస్తే పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. సీఎస్‌ను కలసిన వారిలో ఎస్టీ, ఎస్సీ ఐఏఎస్‌లు మురళి, భారతి లక్‌పతి నాయక్, శర్మన్‌ చవాన్‌ తదితరులు ఉన్నారు.

సీఎంవోలో అండ లేదు!
ముఖ్యమంత్రి కార్యాలయంలో గతంలో కనీసం ఒకరైనా ఎస్సీ లేదా ఎస్టీ ఐఏఎస్‌ అధికారిని నియమించేవారని... ఆ అధికారి ద్వారా తమ గోడును ప్రభుత్వాధినేత దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉండేదని ఎస్సీ, ఎస్టీ ఐఏఎస్‌ అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం సీఎంవోలో ఎస్సీ, ఎస్టీ ఐఏఎస్‌ అధికారులెవరూ లేకపోవడంతో తమ ఆవేదనను ఎవరితో పంచుకునే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌లు భారతి లక్‌పతి నాయక్, టీ విజయ్, విజయేంద్ర, యాకుబ్‌ నాయక్, శర్మన్, శివకుమార్‌ నాయుడు, హరిచందన, ఎంఏ అజీమ్‌ తదితరులు కలెక్టర్‌ పోస్టింగ్‌ కోసం ఎదురు చూస్తున్నారని.. వారితో పోల్చితే పదేళ్లు జూనియర్లు ప్రస్తుతం కలెక్టర్లుగా పనిచేస్తున్నారని అంటున్నారు.

రాష్ట్రం ఏర్పాటయ్యాక 2015 జనవరిలో భారీ స్థాయిలో జరిగిన ఐఏఎస్‌ల బదిలీల్లో చాలా మంది ఎస్సీ, ఎస్టీ అధికారులను అదనపు కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి వంటి పోస్టులకు పరిమితం చేశారని చెబుతున్నారు. జూనియర్‌ ఐఏఎస్‌లు ఫార్చునర్‌ కార్లలో తిరుగుతున్నారని, తాము మాత్రం టాటా ఇండికా కారుకు పరిమితం కావాల్సి వచ్చిందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ అధికారి వ్యాఖ్యానించారు. పెద్దగా పనిలేని పోస్టింగుల్లో ఉండి, పనిచేయకపోయినా ప్రతి నెలా రూ.లక్షలకు పైగా జీతం తీసుకోవడం అపరాధ భావన కలిగిస్తోందని ఆ అధికారి పేర్కొన్నారు. చాలా ప్రభుత్వ శాఖల్లో అవసరం లేకున్నా కేవలం ఎస్సీ, ఎస్టీ ఐఏఎస్‌ల కోసం ఎక్స్‌ కేడర్‌ పోస్టులు సృష్టించి, నియమించారని.. అక్కడ పనిలేక ఖాళీగా కూర్చోవాల్సి వస్తోందని మరో అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. తమకు అవకాశమిస్తే పూర్తి శక్తి సామర్థ్యాల మేరకు పనిచేసి సమర్థత నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

న్యాయం జరగకపోతే ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు..
ఐఏఎస్‌ అధికారులైన తమకు తండ్రి లాంటి వారనే భావనతో సీఎస్‌ ఎస్‌కే జోషిని కలసి సమస్యలు విన్నవించుకున్నామని ఎస్సీ, ఎస్టీ ఐఏఎస్‌లు పేర్కొన్నారు. ఆయన తమకు న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ తమ సమస్యలను పరిష్కరించని పక్షంలో.. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించే యోచన ఉందని ఓ అధికారి తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top