దళితుల ఎదుగుదలను ఎర్రబెల్లి దయాకర్‌రావు ఓర్వలేక పోతున్నారని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు.
ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ రవి
పరకాల(వరంగల్ జిల్లా): దళితుల ఎదుగుదలను ఎర్రబెల్లి దయాకర్‌రావు ఓర్వలేక పోతున్నారని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. వరంగల్ జిల్లా పరకాలలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పగబట్టిన పాము వలే ఎర్రబెల్లి దయాకర్‌రావు... డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిపై నిజం లేని ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఒకే గ్రామం, ఒకే మండలం, ఒకే నియోజకవర్గం నుంచి కడియం శ్రీహరికి ఉన్నతమైన డిప్యూటీ సీఎం పదవి వస్తే సంతోషించాల్సిందిపోయి దిగజారుడు ఆరోపణలకు దిగుతున్నారన్నారు. దళిత సమాజాన్ని అవమానపర్చే విధంగా ఎర్రబెల్లి తీరు ఉందని విమర్శించారు.
నాడు తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రోళ్ల వంచన చేరిన ఎర్రబెల్లి.. ఇప్పుడు దళితుల వ్యతిరేక కార్యక్రమాలను చేపడుతున్నారన్నారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు తీరు మారకపోతే దళితులతో కలిసి నిరసన కార్యక్రమాలను చేపట్టడం కోసం భవిష్యత్ ప్రణాళికను రూపొందిస్తామన్నారు. ఓయూకు చెందిన ఒడ్డెర బస్తీ, యూసఫ్‌గూడ, రామంతాపూర్, బేగంపేట, అస్సీగూడలు బయటకు తీసుకువచ్చి నిర్మాణాలు చేస్తామంటే అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారన్నారు.