ఫలించని ‘దోస్త్‌’ ప్రయత్నాలు!

Satavahana University Admissions Karimnagar - Sakshi

శాతవాహనయూనివర్సిటీ (కరీంనగర్‌): డిగ్రీలో ‘దోస్త్‌’ అధికారులు అందించిన ప్రత్యేక దశ ప్రవేశాల ప్రయత్నం ఫలించలేదు. శాతవాహన యూనివర్సిటీలో సీట్ల భర్తీ వేల సంఖ్యలో పెరుగుతుందని ఆశించినా వారి ఆలోచనలు తారుమారై 330 సీట్లకే పరిమితమైంది. ఇందులోనూ కేవలం 253 సీట్లు మాత్రమే అభ్యర్థులతో నిర్ధారించబడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ కోర్సుల్లో సీట్ల భర్తీ సంఖ్యను పెంచాలనే ఉద్దేశంతో ఐదు దశల్లో ప్రవేశాలకు అవకాశం కల్పించారు. అయినా ఆశించిన ఫలితం దక్కలేదు. ఎంసెట్‌తో  సహా వివిధ కోర్సుల కౌన్సెలిం గ్‌లో పూర్తై.. అందులో సీట్లు రానివారు ప్రత్యేక దశ ద్వారా డిగ్రీ కోర్సుల్లో చేరుతారని భావించినా.. సీట్ల సంఖ్యలో మాత్రం వృద్ధి కనిపించలేదు.

కళాశాల మార్పిడి, అంతర్గత కోర్సుల మార్పిడికి అవకాశం ఇచ్చినా సీట్ల సంఖ్య పెరగలేదు. ఎస్‌యూ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్‌ కలుపుకుని 113 కళాశాలల్లో 45,471 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో వివిధ కోర్సుల్లో కలుపుకుని సోమవారం సాయంత్రం వరకు 21,886 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వర్సిటీలు 1041 కళాశాలల్లో కలుపుకుని ప్రత్యేకదశలో కేవలం 2,578 సీట్ల భర్తీ అయ్యాయి. ఇందులో ఎస్‌యూది 10 శాతమే. ప్రైవేటు కళాశాలలు కొత్తవారితోపాటు వివిధ కళాశాలల్లో చేరినవారికి ఎన్ని ఆఫర్లు ప్రకటించినా చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్ల మార్పు జరగకపోవడంతో యాజమాన్యాల్లో నిరాశ నెలకొంది.
 
సగం కూడా నిండలేదు
దోస్త్‌ అధికారులు ప్రత్యేక దశతో పాటు ఐదు దశలు ప్రవేశాలకు అనుమతించినా ఆశించిన స్థాయిలో సీట్ల భర్తీ పెరగలేదు. శాతవాహన యూనివర్సిటీలో నాలుగేళ్లుగా డిగ్రీ ప్రవేశాలు నేలచూపులు చూస్తున్నాయి. గతంలో పలుమార్లు సీట్ల భర్తీ తీరును పరిశీలిస్తే.. భర్తీ కంటే ఖాళీగా మిగిలిన సీట్లే ఎక్కువగా ఉన్నాయి. వర్సిటీ పరి«ధిలోని 18 ప్రభుత్వ కళాశాలలు, 96 ప్రవేట్‌ కళాశాలల్లో కలుపుకుని బీఏ, బీకాం, బీఎస్సీ, బీసీఏ, బీబీఎం వంటి కోర్సుల్లో 45,471 సీట్లు ఉన్నాయి. మొదటిదశ 13,177 సీట్లు కేటాయించారు. రెండోదశలో 5,743 సీట్ల కేటాయింపుతో నిరాశ పరిచింది. మూడోదశ కేటాయింపు పూర్తయిన తర్వాత యూనివర్సిటీ వ్యాప్తంగా 20,023 సీట్లు కేటాయించగా.. 33.85 భర్తీ శాతం నమోదైంది. గతంలో ఇచ్చిన నాలుగు దశలో 20,350 సీట్లవరకు భర్తీ అయ్యింది. ప్రత్యేక దశ ద్వారా కేవలం 300 సీట్లు కేటాయించగా.. 253 సీట్లు కన్ఫర్మ్‌ చేసుకున్నారు. సోమవారం సాయంత్రం ఐదుగంటల వరకు 21,886 సీట్లు కన్ఫర్మ్‌ చేసుకోగా.. చివరగా ఈ విద్యాసంవత్సరం యూనివర్సిటీలో 23,585 సీట్లు మిగిలాయి.

కళాశాలలకు నిరాశే
సీట్ల నింపుకోవడానికి అవస్థలు పడిన పలు ప్రైవేట్‌ కళాశాలలు.. ప్రత్యేక దశ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆశపడ్డాయి. కొత్తవారిని, వివిధ కళాశాలల్లో సీటు పొందినవారిపై ఆఫర్ల వర్షం కురిపించి ఆకర్షించాలని చేసిన ప్రయత్నాలు పారలేదు. కొందరు విద్యార్థులు మారుదామని ప్రయత్నించినా.. గతంలో సీటు వచ్చిన కళాశాలలు మాయమాటలు, వివిధ ఆఫర్లు ప్రకటించి ఆయా సీట్లు చేజారిపోకుండా జాగ్రత్తపడినట్లు సమాచారం. పీఆర్‌వోలు, లెక్చరర్లు, మధ్యవర్తుల ద్వారా ప్రవేశాలు పెంచుకోవాలని ప్రయత్నించినప్పటికీ ఒకటి, రెండు దశల్లోనే అనుకున్న రీతిలో సీట్లను సంపాదించగలిగాయి. ఆ తర్వాత జరిగిన మూడుదశల్లో వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఏదేమైనా మున్ముందు డిగ్రీ కోర్సులు చేయడానికి ముందుకు వచ్చేవారి సంఖ్య ఏటేటా పడిపోతోందని విద్యారంగనిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌ అవసరాలకనుగుణంగా ఎప్పుటికప్పుడు కొత్త కోర్సులు ప్రవేశపెడుతూ డిగ్రీకి పూర్వ వైభవం తీసుకురావాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top