‘చెత్త’ కష్టాలు | sanitation problems in nizamabad | Sakshi
Sakshi News home page

‘చెత్త’ కష్టాలు

Feb 14 2018 3:38 PM | Updated on Nov 9 2018 5:52 PM

sanitation problems in nizamabad - Sakshi

చెత్తతో నిండిన కుండీ

నిజాంసాగర్‌(జుక్కల్‌) : పరిసరాల పరిశుభ్రత, సం పూర్ణ పారిశుధ్యానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రా ధాన్యత ఇచ్చినా క్షేత్రస్థాయిలో అధికారులకు చెత్తపై చిత్తశుద్ధి కరువైంది. ఇంటింటా వ్యక్తిగత మరుగు దొడ్ల నిర్మాణంతో స్వచ్ఛ గ్రామాలు సాధ్యమంటున్నా అమలులో ఆచరణకు నోచుకోవడం లేదు. దీంతో జనావాసాలు, కాలనీల్లో కుప్పలుతెప్పలుగా చెత్త పేరుకుపోతోంది. చెత్త తరలింపు కోసం రిక్షాలు, చెత్త నిల్వల కోసం తవ్విన డంపింగ్‌యార్డు లు ఊరురా వృథాగా మారుతున్నాయి.  

ఉపాధి నిధులు డంపింగ్‌ యార్డుల పాలు..
‘పల్లె సీమలను పట్టుగొమ్మలుగా నిలపాలన్న ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛతపై దృష్టి సారించాయి. అందులో భాగంగా జిల్లాలోని 323 గ్రామ పంచాయతీలు, ఆయా గ్రామాల్లో చెత్త నిల్వల కోసం డంపింగ్‌ యార్డులు మంజూరయ్యాయి. తద్వారా జిల్లాలో 314 గ్రామాల్లో డంపింగ్‌ యార్డుల తవ్వకానికి ఉపాధి హామీ పథకం రూ.45 కోట్లు ఖర్చు చేశారు. గతేడాది జిల్లాలోని ఆయా గ్రామ పంచాయతీల్లో డంపింగ్‌ యార్డులను ఉపాధి కూలీలతో తవ్వించారు. రెక్కల కష్టాన్ని నమ్ముకున్న కూలీలకు ఉపాధి పనులు కల్పించడంతో, చెత్తపై సమరానికి రూ.కోట్లు ఖర్చు చేశారు. ఒక్కొక్క డంపింగ్‌ యార్డు తవ్వకానికి ఉపాధి పథకం కింద రూ.1.7 లక్షలు ఖర్చు చేశారు. అయినా ఆయా గ్రామాల్లో ఉపాధి కూలీలు తవ్విన డంపింగ్‌ యార్డులు వృథాగా మారాయి. గ్రామాల్లో తవ్విన డంపింగ్‌ యార్డుల్లోకి చెత్తను తరలించేవారు గ్రామ పంచాయతీల్లో కరువయ్యారు. దీంతో ఆయా గ్రామ శివారు ప్రాంతాల్లో, కాలనీలు, జనావాసాల మధ్య చెత్తాచెదారం నిండటంతో వీధులు అపరిశుబ్రంగా మారాయి. మురికి కాలువల్లో నుంచి తీసిన చెత్తను రోడ్లపై పారేయడంతో కాలనీలు దుర్గంధంతో కొట్టుమిట్టాడుతున్నాయి. చెత్త నిల్వల కోసం తవ్విన డంపింగ్‌ యార్డులు వృథాగా మారాయి. తద్వారా గ్రామాల్లో తవ్విన డంపింగ్‌ యార్డులు సైతం కనుమరగవుతున్నాయి.

మూలనపడ్డ రిక్షాలు..
జిల్లాలోని 323 గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతేడాది చెత్తరిక్షాలను సరఫరా చేసింది. ఒక్కొక్క గ్రామ పంచాయతీకి మూడు చొప్పున మూడు చక్రాల చెత్త రిక్షాలను సరఫరా చేసినా చె త్తను తరలిం చేసిబ్బంది లేకపోవడంతో రిక్షాలు మూలనపడ్డాయి. జిల్లాలోని కామారెడ్డి, బాన్సువా డ, ఎల్లారెడ్డి పట్టణాలు, మండల కేంద్రాల్లో తప్ప మిగతా గ్రామ పంచాయతీల్లో చెత్తరిక్షాలను ఉపయోగించిన దాఖలాలు కన్పించవు. వందశాతం సంపూర్ణ పారిశుధ్యం కోసం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మిస్తున్న గ్రామ పంచాయతీలకు ప్రభుత్వపరంగా ఒక్కొక్క పంచాయతీకి మూడు చెత్తరిక్షాలను సరఫరా చేశారు. గ్రామ పంచాయతీల్లో సరిౖన సిబ్బంది లేకపోవడంతో చెత్తరిక్షాలు ఉపయోగం లేక తుప్పుపడుతున్నాయి. గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య పనులపై పంచాయతీ కార్యదర్శుల పర్యవేక్షణ లేకపోవడంతో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారుతుంది. అధికారులు ఇకనైనా స్పందించి చెత్తరిక్షాలు, డంపింగ్‌ యార్డులను ఉపయోగంలోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement