అతివకు భరోసా! 

Sakhi Program Helps Women Protection In Mahabubnagar - Sakshi

జిల్లా కేంద్రంలో ఇటీవల సఖీ కేంద్రం ప్రారంభం

మహిళల హక్కుల రక్షణకు ప్రాధాన్యం

సాక్షి, మహబూబ్‌నగర్‌ క్రైం: నిర్భయ కేసులు నమోదు తర్వాత దేశంలో భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది. అత్యాచారానికి గురైన బాధితులకు సంబంధించి ప్రస్తుత విచారణ విధానాన్ని రీవిక్టిమైజేషన్‌ ఆఫ్‌ విక్టిమ్‌ అని అంటారు. అర్థం అయ్యేలా చెప్పుకోవాలంటే అత్యాచారానికి గురైనా అమ్మాయి మొదట పోలీసులకు తనకేం జరిగిందో చెప్పాలి. ఆ తర్వాత వైద్యులకు, న్యాయవాదులకు, ఆపై మేజిస్ట్రేట్‌కు జరిగిన ఘటన నేపథ్యం వివరించాల్సి వస్తుంది, ఇలా చేయడం వల్ల మళ్లీ మళ్లీ ఆమెలోని గాయాన్ని రేపడమే అవుతుందని అధికారులు భావించారు. దీని కారణంగా వారిలో మానసికమైన కుంగుబాటు వస్తుంది.

ఈ విధానానికి స్వస్తి పలికి అందరిని ఒకే గొడుగు కిందకు తీసుకురావాలనే ఆలోచనతో భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ పనిచేసే సిబ్బందికి శిక్షణ ఇస్తారు. ఎవరూ అమర్యాదగా మాట్లాడేందుకు అవకాశం ఉండదు. మహిళలు, పిల్లలకు సంబంధించిన కేసులు పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైన తరువాత భరోసా కేంద్రానికి వస్తాయి. మొత్తంగా పాత విధానానికి స్వస్తి పలికేందుకు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో మహబూబ్‌నగర్‌లో మాత్రమే ఒక మహిళా ఠాణా ఉంది.

ఇక్కడకే ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఎక్కువ కేసులు వస్తున్నాయి. నాలుగు జిల్లాల్లో కూడా సఖి–భరోసా కేంద్రాలు ఏర్పాటైతే మహిళలు వచ్చి ఫిర్యాదు చేయడంతో పాటు సత్వరంగా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కేంద్రలోకి భాధితులు వచ్చిన వెంటనే మనోవికాస నిపుణుడు బాధితురాలితో మాట్లాడి వారికి జరిగిన అన్యాయంపై పూర్తిస్థాయిలో వివరాలు సేకరిస్తారు. ఆ తర్వాత ఆమెకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top