ఆర్టీఈని ఎందుకు నీరుగారుస్తున్నారు?

RTE Act Is Being Neglected - Sakshi

తెలుగు రాష్ట్రాల తీరుపై హైకోర్టు అసంతృప్తి

సాక్షి, హైదరాబాద్ ‌: ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌ పాఠశాలల్లో 25% సీట్లను అర్హులైన పేద విద్యార్థులకు కేటాయించాలని విద్యా హక్కు చట్టం(ఆర్టీఈ) నిబంధనలను ఎందుకు అమలు చేయట్లేదని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను హైకోర్టు ప్రశ్నించింది. పేద విద్యార్థులకు ఉపయోగపడాలనే చట్ట సంకల్పాన్ని ఎందుకు నీరుగారుస్తున్నారని ప్రశ్నించింది.

ఈ చట్టాన్ని తెలుగు రాష్ట్రాలు సక్రమంగా అమలు చేయట్లేదంటూ వనపర్తి జిల్లా ఆత్మకూరు గ్రామానికి చెందిన వై.తిప్పారెడ్డి రాసిన లేఖను హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌) పరిగణించి అప్పటికే తాండవ యోగేశ్‌ అనే లా విద్యార్థి దాఖలు చేసిన పిల్‌తో జత చేసి మంగళవారం విచారించింది. ఆర్టీఈ చట్టం 2007లో వస్తే నేటికీ సక్రమంగా ఎందుకు అమలు చేయలేకపోతున్నారని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ కొంగర విజయలక్ష్మితో కూడిన ధర్మాసనం మండిపడింది.

ఏపీకి చెందిన ఒక మంత్రికే ప్రైవేటు విద్యా సంస్థలున్నాయని, ఆర్టీఈ చట్టానికి అనుగుణంగా జారీ అయిన జీవోలపై కోర్టులు స్టేలు ఇస్తే వాటిని ప్రభుత్వాలు రద్దు చేసేందుకు ప్రయత్నించట్లేదని పిటిషనర్‌ యోగేశ్‌ వాదించారు. పలు రాష్ట్రాల్లో ఆర్టీఈ చట్టం బాగా అమలు జరుగుతోందని చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు–వసూలు చేస్తున్న ఫీజులు, సిబ్బంది–వారి విద్యార్హతలు, 25% సీట్ల వివరాలు, ఇతర సమాచారం విద్యాధికారి దగ్గర ఉండాలని, ఇవన్నీ వెబ్‌సైట్‌లో పొందుపర్చకుండా నిబంధనల్ని కాలరాస్తున్నారని చెప్పారు.

ప్రైవేటు పాఠశాల్లో చదివే విద్యకు ఫీజుల్ని రీయింబర్స్‌మెంట్‌ చేస్తే.. సర్కారీ బడులు మూతపడే ప్రమాదం ఉందని ఏపీ ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఆర్టీఈ చట్టం ఏమేరకు అమలు చేశారో వివరణ ఇవ్వాలని రెండు రాష్ట్రాల్ని ఆదేశించింది. కేంద్ర మానవ వనరుల శాఖ కార్యదర్శి, ఇరు రాష్ట్రాల పాఠశాల విద్యా శాఖ ముఖ్యకార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. విచారణ 3 వారాలకు వాయిదా వేసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top