అంబరాన్నంటిన ఆర్టీసీ సంబరాలు | Rtc workers celebrations | Sakshi
Sakshi News home page

అంబరాన్నంటిన ఆర్టీసీ సంబరాలు

May 14 2015 3:24 AM | Updated on Aug 14 2018 10:51 AM

వారంరోజుల పాటుసమ్మెలో పాల్గొన్న కార్మికులు బుధవారం ఎట్టకేలకు విధుల్లో చేరారు.

మహబూబ్‌నగర్ అర్బన్ : వారంరోజుల పాటుసమ్మెలో పాల్గొన్న కార్మి కులు బుధవారం ఎట్టకేలకు విధుల్లో చేరారు. 44 శాతం ఫిట్‌మెంట్‌తో పాటు మరిన్ని అనూహ్య ఆర్థిక వెసులుబాట్లు కల్పిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సమ్మెను విరమించారు. ఏం చేస్తారోనన్న దిగులుతో జిల్లాలో ఉన్న 4450 మంది ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

అడిగిన దాని కంటే ఒకశాతం ఫిట్‌మెంట్ ఇవ్వడానికి సీఎం సంకేతాలు పంపారని ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర నాయకత్వం నుంచి సమాచారం అందడంతో జిల్లా నాయకులు టపాసులు పేల్చి, రంగులు చల్లుకుని సంబరాలు చేసుకోవడానికి సిద్ధమయ్యారు. జిల్లాలో ఉన్న 9 బస్ డిపోల పరిధిలో కార్మికులు ఆనందోత్సాహాలను పంచుకున్నారు. చాలాచోట్ల కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు.

ఆర్టీసీ జేఏసీ నాయకులు రాజసింహుడు, డీఎస్‌చారి, బసప్ప, కొండయ్య, నారాయణమ్మ, సాయిరెడ్డి, వీరాంజనేయులు మాట్లాడుతూ..సీఎం 44శాతం ఫిట్‌మెంట్ ఇవ్వడానికి అంగీకరించి తమపట్ల తన ఔదార్యాన్ని చాటుకున్నారని అన్నారు. రిటైర్డ్ కార్మికులకు ఆర్డనరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో పూర్తి ఉచిత ప్రయాణం కల్పించడం ఆర్టీసీ చరిత్రలో గొప్ప నిర్ణయమన్నారు.

 ఏడో రోజు కొనసాగిన సమ్మె..
 ఆర్టీసీ కార్మికులు జిల్లావ్యాప్తంగా ఏడో రోజు సమ్మెను ఉధృతంగానే కొనసాగించారు. వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించి నిరసన తెలిపారు. అధికారులు మాత్రం పోలీసుల సహాయంతో సుమారు 250కిపైగా బస్సులను నడిపి తమ పట్టుదలను నెగ్గించుకున్నారు. గత వారం రోజులుగా జరిగిన సమ్మె కారణంగా సంస్థకు జిల్లాలో దాదాపు రూ.ఐదుకోట్లకుపైగా నష్టం వాటిల్లిందని అధికారుల అంచనా.

డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు, గ్యారేజ్ కార్మికులు, మినిస్ట్రియల్ సిబ్బంది సుమారు 4450 మంది సమ్మెలో పాల్గొనగా ఆర్‌ఎం, డిప్యుటీ సీటీఎం, డిప్యుటీ సీఎంఈ, తొమ్మిది మంది  డీఎంలతోపాటు వైద్యులు, పారామెడికల్ సిబ్బంది మాత్రం విధులు నిర్వహించారు. కాగా, సమ్మె విరమించినట్లు జేఏసీ ప్రకటించడంతో గత షెడ్యూల్ ప్రకారం నైట్‌హాల్ట్ బస్సుల విధుల్లో కార్మికులు చేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement