హైకోర్టు తీర్పు కాపీ అందేవరకూ ఆందోళనలు యథాతథం

RTC JAC Says Will Protest Till High Court Copy Come - Sakshi

ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కేంద్రం, రాష్ట్రం దొందూ దొందే 

నేటి సడక్‌ బంద్‌ తాత్కాలిక వాయిదా: అఖిలపక్షం నేతలు  

దీక్ష విరమించిన ఆర్టీసీ జేఏసీ నాయకుడు లింగమూర్తి  

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికుల సమ్మెపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి చూస్తుంటే.. అవి దొందూ దొందే అన్న చందంగా మారాయనే విషయం స్పష్టమవుతోందని అఖిలపక్ష నేతలు ఆరోపించారు. ఆర్టీసీ జేఏసీ నాయకుడు లింగమూర్తి మూడు రోజులుగా రాంనగర్‌లో చేస్తున్న నిరాహార దీక్షను సోమవారం రాత్రి అఖిలపక్షం నేతలు ప్రొఫెసర్‌ కోదండరాం, చాడ వెంకటరెడ్డి, తమ్మినేని వీరభద్రం, వినోద్‌రెడ్డి, మందకృష్ణ మాదిగ, కె.గోవర్ధన్, కె.రమ తదితరులు నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సోమవారం హైకోర్టు ఇచ్చిన తీర్పు సంతృప్తికరంగా లేదన్నారు. గత 45 రోజులుగా ఆర్టీసీ కార్మికుల ఆకాంక్షలను వ్యక్తం చేయడానికి కోర్టు అవకాశం కల్పించిందన్నారు. ఇప్పటికీ సమ్మెను చట్ట వ్యతిరేకంగా గుర్తించడానికి కోర్టు అంగీకరించలేదని, కార్మికులను బిడ్డలుగా చూడాలి తప్ప అణచివేసే ధోరణి మంచిదికాదని మొదటి నుంచీ చెబుతోందని తెలిపారు.

హైకోర్టు తీర్పు కాపీ చూసేవరకు ఆందోళనలు ఆపకుండా యథావిధిగా కొనసాగుతాయని, నేడు తలపెట్టిన సడక్‌ బంద్‌ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. లోటు బడ్జెట్‌ ఉన్న ఏపీలో ప్రధాన డిమాండ్‌లు సాధ్యమవుతున్నప్పుడు మిగులు బడ్జెట్‌ ఉన్న తెలంగాణలో సాధ్యం కాకపోవడానికి కేసీఆర్‌ ఆర్టీసీ ఆస్తులను కొల్లగొట్టాలనే స్వార్థ బుద్ధే అసలు కారణమనే విషయాన్ని తెలంగాణ సమాజం ఇప్పుడిప్పుడే గ్రహిస్తోందన్నారు. హైకోర్టు సాక్షిగా దాఖలు చేసిన పిటిషన్, కేసీఆర్‌ మాటలు ఒకేరకంగా ఉన్నాయన్నారు. కార్మికుల సమ్మె పట్ల కేసీఆర్‌ దారుణంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల 45 రోజుల సమ్మె చరిత్రలో నిలిచిపోతుందని కొనియాడారు.  కార్యక్రమంలో సీపీఎం నాయకులు వెంకట్, సుధాభాస్కర్, డి.జి. నర్సింగ్‌రావు, న్యూడెమోక్రసీ నాయకులు హన్మేష్, ఎస్‌.ఎల్‌. పద్మ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top