రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచాలని యోచించడం సరికాదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పి.ప్రభుగౌడ్ సూచించారు.
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రభుగౌడ్
సంగారెడ్డి క్రైం : రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచాలని యోచించడం సరికాదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పి.ప్రభుగౌడ్ సూచించారు. సంగారెడ్డిలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ చార్జీలను పెంచడం వల్ల పేద, మధ్యతరగతి ప్రయాణికులపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. ఇటీవల ఆర్టీసీ కార్మికుల వేతనాలను భారీగా పెంచిన నేపథ్యంలో చార్జీల భారాన్ని ప్రయాణికులపై మోపడం దారుణమని విమర్శించారు.
సీఎం కేసీఆర్ కార్మికులకు వరాలు ఇస్తూ పేదలపై భారం వేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరగడంతో పేద, మధ్య తరగతి ప్రజలు అల్లాడిపోతున్నారన్నారు. ఇటీవల పలుమార్లు పెంచిన పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు, కూరగాయల పెరిగాయని, ఈ భారం నుంచి ప్రజలు బయట పడకముందే బస్సు చార్జీలను పెంచాలని యోచించడం తగదన్నారు.
రాష్ట్రంలో బడా సంస్థలకు ఇస్తున్న రాయితీలను తగ్గించైనా పేదలపై భారం పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు సుధాకర్‌గౌడ్, మక్సూద్ అలీ, పరుశురాంరెడ్డి, బాగన్నగౌడ్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.