కొత్తకుంటకు జలకళ

Rivers Are Filled With Mid Maneru Water - Sakshi

చేరుకున్న మిడ్‌మానేరు నీరు

హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు

గన్నేరువరం : మిడ్‌ మానేరు నీటితో మండలంలోని వివిధ గ్రామాల్లోని చెరువులు, కుంటలకు జలకళ సంతరించుకుంటుంది. మండలంలోని మాధాపూర్‌ గ్రామం కొత్తకుంటకు మిడ్‌ మానేరు నీటిని డిస్ట్రిబ్యూటర్‌ 9 ఉపకాల్వ ద్వారా విడుదల చేశారు. ఆ నీటితో కుంట నిండుకోవడంతో జలకళ వచ్చింది. రాజన్న సిరిసిల్లా జిల్లా బోయినిపల్లి మండలంలోని కొదురుపాకలో నిర్మించిన మిడ్‌ మానేరు నుంచి సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామం వరకు గతంలో 34 కిలోమీటర్ల వరదకాల్వను పూర్తి చేశారు. మండలంలోని చీమలకుంటపల్లె, గునుకుల కొండాపూర్, పీచుపల్లి గ్రామాల మీదుగా మిడ్‌ మానేరు కుడికాల్వ నిర్మాణం ఉంది. అలాగే ఈ ఏడాది తోటపల్లి గ్రామంలో తోటపల్లి రిజర్వాయర్‌ను పూర్తి చేసి గత నెల 11వ తేదీన దీనిలోకి మిడ్‌మానేరు కుడికాల్వ ద్వారా నీటి పారుదలశాఖ అధికారులు నీటిని విడుదల చేశారు. 

ఈ రిజర్వాయర్‌ నిండుకుని కుడికాల్వలో బ్యాక్‌వాటర్‌ పెరిగింది. ఈ క్రమంలో ఈ నీటిని అక్టోబర్‌లో డిస్ట్రిబ్యూటర్‌ 4 ఉపకాల్వ ద్వారా గన్నరువరం గ్రామ చెరువుకు, పారువెల్ల గ్రామ పంట పొలాలకు నీటిని విడుదల చేశారు. బుధవారం ఖాసీంపేట గ్రామంలోని డిస్ట్రిబ్యూటర్‌ 8 ఉప కాల్వకు విడుదల చేశారు. తాజాగా మాధాపూర్‌ గ్రామానికి నీటిని విడుదల చేసి కొత్తకుంటను నింపడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బావుల్లో భూగర్భజలాలు పెరగడానికి దోహదపడుతుందని అంటున్నారు. కుడికాల్వలో నీటినిల్వతో దాని సమీపంలోని బావుల్లో, బోరుబావుల్లో భూగర్భజలాలు పెరిగినట్లు చీమలకుంటపల్లెకు చెందిన శ్రీనివాస్‌ తెలిపారు. రబీలో వరిసాగు చేయడానికి అనుకూలంగా మారిందని పేర్కొంటున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top