ఖరీఫ్‌ను మించి 'యాసంగిలో'..!

Rice grain markets are expected to hit the state in current Yasangi season - Sakshi

ఏకంగా 59 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం అంచనా

ఖరీఫ్‌కన్నా ఏకంగా 12 లక్షలు, గత యాసంగికన్నా 22 లక్షల టన్నులు ఎక్కువ

నీటి లభ్యత పెరిగి, సాగు విస్తీర్ణం 10 లక్షల ఎకరాల మేర పెరగడమే కారణం

నేడు యాసంగి ధాన్యం సేకరణపై సన్నాహక సమావేశం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రస్తుత యాసంగి సీజన్‌లో వరి ధాన్యం మార్కెట్లను ముంచెత్తనుంది. విస్తారంగా కురిసిన వర్షాలతో నిండిన ప్రాజెక్టుల ద్వారా పుష్కలంగా నీటి సరఫరా జరగడం, చెరువుల కింద సాగు విస్తీర్ణం పెరగడంతో ధాన్యం దిగుబడి గత ఖరీఫ్‌ కంటే అధికంగా ఉండనుంది. ఈ యాసంగిలో ఏకంగా 59 లక్షల టన్నుల మేర ధాన్యం సేకరించే అవకాశం ఉంటుందని పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖలు అంచనా వేస్తున్నాయి. ఇది గత ఖరీఫ్‌ లో సేకరించిన దానికన్నా ఏకంగా 12 లక్షల టన్ను లు అధికంగా వచ్చే అవకాశం ఉండటం విశేషం. 

రాష్ట్రంలో ఈ ఏడాది యాసంగిలో విస్తృతంగా వరి సాగు జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటి ఎత్తిపోతల జరిగి ఎస్సారెస్పీ పూర్తి ఆయకట్టుకు నీరు అందడం, నాగార్జునసాగర్, ఇతర మధ్యతరహా ప్రాజెక్టుల కింద నీటి లభ్యత పుష్కలంగా ఉండటంతో సాగునీటి ప్రాజెక్టుల కింద వరిసాగు పెరిగింది. గతేడాది యాసంగిలో మొత్తంగా 18.57 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరిసాగు జరగ్గా ఈ ఏడాది అది ఏకంగా 28.55 లక్షల ఎకరాలకు పెరిగింది. 10 లక్షల ఎకరాల మేర సాగు పెరగడంతో ఈ సీజన్‌లో వరి ధాన్యం భారీగా మార్కెట్‌లోకి వ స్తుందని అంచనా. గతేడాది యాసంగిలో పౌరసర ఫరాల శాఖ 37 లక్షల వరి ధాన్యాన్ని కొనుగోలు చే సింది.

మొన్నటి ఖరీఫ్‌లో 47.11 లక్షల టన్నులు సేకరించింది. అయితే ఈ యాసంగిలో రాష్ట్ర చరిత్ర లో ఎన్నడూ లేనంతగా ఏకంగా 59 లక్షల టన్నులు సేకరించాల్సి ఉంటుందని పౌరసరఫరాలు, వ్యవసాయ శాఖలు అంచనా వేశాయి. ఖరీఫ్‌కన్నా ఏకంగా 12 లక్షలు, గతేడాది యాసంగికన్నా 22 లక్షల టన్నుల మేర అధికంగా వచ్చే అవకాశాల నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లకు సిద్ధమయ్యాయి. ఖరీఫ్‌ లోనే 3,670 కొనుగోలు కేంద్రాలు, 12 కోట్ల గోనెసంచులు అందుబాటులో ఉంచగా ఈ ఏడాది అం తకుమించి ఏర్పాటు చేయాల్సి ఉంటుందని శాఖలు తేల్చాయి. కొనుగోలు కేంద్రాల సంఖ్యను 4 వేలకు పెంచే అవకాశాలున్నాయి. ఇక ఖరీఫ్‌లో రూ. 8,626 కోట్లు సేకరణకు వెచ్చించగా ఈ సీజన్‌లో రూ. 10 వేల కోట్లు అవసరం ఉంటుందని లెక్కిస్తున్నారు. ఈ సీజన్‌లో సైతం క్వింటాలు గ్రేడ్‌–ఏ వరి ధాన్యానికి రూ.1,835, కామన్‌ వెరైటీకి రూ. 1,815 చొప్పున అందించనున్నారు.  

రైతులకు అవగాహన: యాసంగి ధాన్యం సేకరణపై సన్నాహక సమావేశాన్ని సోమవారం వ్యవసాయ శాఖ, పౌర సరఫరాల శాఖలు నిర్వహించనున్నాయి. ఈ భేటీకి మంత్రులు గంగుల కమలాకర్, నిరంజన్‌రెడ్డితోపాటు ఇరు శాఖల అధికారులు హాజరుకానున్నారు. ధాన్యం విక్రయంపై రైతులకు అవగాహన కల్పిస్తూ నాణ్యత, పరిమాణం విషయంలో మరింత పకడ్బందీగా వ్యవహరించేలా వ్యవసాయ శాఖను ధాన్యం సేకరణలో భాగస్వామిని చేయనున్నారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి ఏఈఓను ఇన్‌చార్జిగా నియమించడం, పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యం మార్కెట్‌లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం వంటి అంశాలపై చర్చించనున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top