జేఎన్టీయూహెచ్‌లో అధ్యాపకుల భర్తీ | Sakshi
Sakshi News home page

జేఎన్టీయూహెచ్‌లో అధ్యాపకుల భర్తీ

Published Thu, Apr 25 2019 2:03 AM

Replacement of teachers in JNTUH - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జేఎన్టీయూహెచ్‌లో 186 అధ్యాపకుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వీటిలో ఇప్పటికే 32 ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ కాగా, మిగిలిన 154 అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి త్వరలో ప్రకటనలు జారీ కానున్నాయి. జేఎన్టీయూహెచ్‌ హెడ్‌క్వార్టర్స్‌తోపాటు హైదరాబాద్, జగిత్యాల, మంథని, సుల్తాన్‌పూర్‌లోని జేఎన్టీయూహెచ్‌ ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ఖాళీ అధ్యాపక పోస్టుల భర్తీ లో భాగంగా ఈ నియామకాలను చేపట్టను న్నారు. జేఎన్టీయూహెచ్‌లో మొత్తం 410 అధ్యాపక పోస్టులుండగా, తాజాగా ఖాళీల సంఖ్య 260కు పెరిగిందని జేఎన్టీయూహెచ్‌ వీసీ ప్రొఫెసర్‌ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ఖాళీలు 186గా ఉన్నప్పుడు పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చిందని, ఆ తర్వాత జరిగిన పదవీ విరమణలతో ఈ సంఖ్య 260కు పెరిగిందన్నారు. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందు ఈ ఖాళీలు భర్తీ చేస్తా మన్నారు.

ఈ నెల 26న జవహర్‌లాల్‌ నెహ్రూ ఆడిటోరియంలో సాయంత్రం 3 గంటలకు వర్సిటీ స్నాతకోత్సవం జరగనుందని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్‌ నరసింహన్‌ ముఖ్యఅతిథిగా హాజరవుతారని చెప్పారు. స్నాతకోత్సవంలో ఐఐటీహెచ్‌ డైరెక్టర్‌ యూబీ దేశాయ్‌కు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయనున్నామని తెలిపారు. ఈ ఏడాది నిర్వహించిన క్యాంపస్‌ నియామకాల్లో జేఎన్టీయూహెచ్‌ ఇంజనీరింగ్‌ కళాశాలల విద్యార్థులు 721 మంది ఎంపికయ్యారన్నారు. మైక్రోసాప్ట్, ఐబీఎం వంటి 52 కంపెనీలు క్యాంపస్‌ నియామకాల్లో పాల్గొన్నాయని చెప్పారు.

Advertisement
Advertisement