
తారస్థాయికి చేరిన అవినీతి ఆరోపణలు
అటానమస్ అఫైర్స్ డైరెక్టర్ తొలగింపు
92 అటానమస్ కాలేజీల్లో అఫ్లియేషన్‌పై విమర్శలు
సాక్షి, హైదరాబాద్ : జేఎన్‌టీయూహెచ్‌లో అంతర్గత వివాదం తారస్థాయికి చేరింది. అవినీతి ఆరోపణలతో వర్సిటీ ప్రతిష్ట దిగజారే పరిస్థితి తలెత్తింది. అటానమస్ కాలేజీల అకడమిక్ ఆడిట్ డైరెక్టర్‌ను బోధకుడిగా బదిలీ చేస్తూ రిజిస్ట్రార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
అసలేం జరిగింది?
జేఎన్‌టీయూహెచ్ ప్రతి ఏటా 140 ఇంజనీరింగ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇస్తుంది. ఇందులో 92 అటానమస్ కాలేజీలున్నాయి. గత ఏడాది అటానమస్, నాన్–అటానమస్‌ను విడగొట్టి ఇద్దరు డైరెక్టర్లను నియమించారు. అటానమస్ కాలేజీలకు ప్రొఫెసర్ రవీందర్‌రెడ్డి డైరెక్టర్‌గా ఉన్నారు. వీటికి గుర్తింపు ఇచ్చే ముందు వర్సిటీ తనిఖీ బృందం ప్రతీ కాలేజీని పరిశీలిస్తుంది. చాలా కాలేజీల్లో సరైన ఫ్యాకల్టీ లేదని గుర్తించారు. మౌలిక వసతులు మచ్చుకైనా లేదని తనిఖీల కమిటీ నిగ్గు తేల్చినట్టు తెలిసింది. కంప్యూటర్ సైన్స్, ఎమర్జింగ్ వంటి కోర్సుల్లో చాలా కాలేజీల్లో అర్హులైన సిబ్బందే లేరని గుర్తించారు.
ఇన్ని లోపాలున్నా అన్ని కాలేజీలకు జేఎన్‌టీయూహెచ్ అనుబంధ గుర్తింపు ఇచ్చింది. ఈ వ్యవహారంపై అన్నివర్గాల నుంచి విమర్శలు వచ్చాయి. పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్టు ఆరోపణలున్నాయి. వర్సిటీ ఉన్నతాధికారితో ప్రత్యక్ష సంబంధాలున్న వ్యక్తి కన్సల్టెన్సీ ఏర్పాటు చేయడం, అక్కడ లావాదేవీలు నిర్వహించడం విమర్శలకు దారి తీసింది. వీటిపై సీఎం కార్యాలయానికి ఫిర్యాదులు వెళ్లినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే అటానమస్ అకడమిక్ డైరెక్టర్ బదిలీ అవ్వడం ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.
అసలు కథ పక్కదారి
తనిఖీ బృందాల నివేదిక ప్రకారం కొన్ని కాలేజీలకు జేఎన్‌టీయూహెచ్ జూన్‌లో నోటీసులు జారీ చేసింది. లోపాలు సరి చేసుకునేందుకు సమయం ఇచ్చినట్టు అధికారులూ చెప్పా రు. కానీ ఎక్కడా కొత్తగా అర్హులైన ఫ్యాకల్టీని నియమించినట్టు గానీ, మౌలిక వసతులు కల్పించిన దాఖలాల్లేవు. వీటన్నింటికీ గుర్తింపు మాత్రం ఇచ్చారు.
ప్రైవేటు కన్సల్టెన్సీ ద్వారా ఆ కాలేజీలు బేరం కుదుర్చుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. తీగ లాగితే డొంకంతా కదులుతుందన్న ఆందోళనతో ఉన్నతాధికారులు అటానమస్ డైరెక్టర్‌ను బదిలీ చేసి, చేతులు దులుపుకున్నట్టు తెలుస్తోంది. ఆరోపణలపై మాత్రం వీసీ ఇంత వరకూ నోరు మెదపలేదు. దీనిపై వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించలేదు.
ప్రొఫెసర్లు తక్కువగా ఉన్నారనే బదిలీ
అటానమస్, నాన్–అటానమస్‌ను కలిపేశాం. బోధనకు ప్రొఫెసర్ల కొరత ఉందనే ఇలా చేశాం. రవీందర్‌రెడ్డిని సబ్జెక్టు బోధనకు వినియోగిస్తున్నాం. విద్యార్థుల నుంచి వచ్చిన ఆరోపణలకు, బదిలీకి సంబంధం లేదు. తనపై విద్యార్థులు నిరాధార ఆరోపణలు చేశారని రవీందర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరుపుతాం. – డాక్టర్ కె.వెంకటేశ్వరరావు రిజిస్ట్రార్