రూ.కోట్ల భూమి క్రమబద్ధీకరణ

Regulation  of Valuable lands in Nallagonda - Sakshi

నల్లగొండలో విలువైన భూములు

కబ్జాదారుల దుకాణాల క్రమబద్ధీకరణకు ఓకే

జిల్లా కలెక్టర్‌కు పురపాలక శాఖ అనుమతి

సాక్షి, హైదరాబాద్‌: నల్లగొండ జిల్లా కేంద్రం నడిబొడ్డున రూ.కోట్లు విలువచేసే వివాదాస్పద భూముల్లో నిర్మించిన దుకాణాలను మూకుమ్మడిగా క్రమబద్ధీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. నల్లగొండ పట్టణంలోని ప్రధాన వాణిజ్య కేంద్రమైన ప్రకాశం బజార్‌లో సర్వే నెం.32లో 10.06 ఎకరాల వివాదాస్పద భూములున్నాయి. ఈ భూముల యాజమాన్య హక్కులు తమవేనని రెవెన్యూ శాఖ, నల్లగొండ మునిసిపాలిటీ, వక్ఫ్‌బోర్డుతోపాటు కొందరు ప్రైవేటు వ్యక్తులు, కబ్జాదారులు గత మూడు దశాబ్దాలుగా పోరాడుతున్నారు.

కబ్జాదారుల నుంచి ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం భూముల ధరలను వసూలు చేసి ఈ వివాదాస్పద భూముల్లో నిర్మించిన 234 వాణిజ్య దుకాణాలను క్రమబద్ధీకరించేందుకు జిల్లా కలెక్టర్‌కు తాజాగా రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ అనుమతిచ్చింది. ఈ మేరకు ఆ శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌ కుమార్‌ ఈనెల 18న మెమో జారీ చేశారు. ఈ స్థల వివాదంపై నల్లగొండ జిల్లా కలెక్టర్‌ గత జూన్‌లో ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికతో పాటు, స్థానిక ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి సిఫారసులను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.  

నాలుగు దశాబ్దాల చిక్కుముడి!
ప్రకాశంబజార్‌లోని భూముల వివాదం చిక్కుముడిగా మారడంతో గత ప్రభుత్వాలు పెండింగ్‌లో పెట్టాయి. ప్రభుత్వానికి నల్లగొండ జిల్లా కలెక్టర్‌ సమర్పించిన నివేదిక ప్రకారం..సర్వే నం.32 పరిధిలోని 10.06 ఎకరాల భూమి 1944–81 మధ్యకాలానికి సంబంధించిన పçహాణీ రికార్డుల్లో ఖరీజ్‌ ఖాతాగా నమోదై ఉందని నల్లగొండ తహసీల్దార్‌ 1981లో నివేదిక సమర్పించారు. ఈ భూములను లీజుకు ఇవ్వాలని నల్లగొండ మునిసిపాలిటీ 1971లో తీర్మానం చేసింది.

ఎకరాకు రూ.15 చొప్పున రూ.1,518ల ధర చెల్లించినందున ఈ భూములను స్థానిక మునిసిపాలిటీకి కేటాయిస్తూ 1963లో అప్పటి నల్లగొండ తహసీల్దార్‌ జారీ చేసిన ఉత్తర్వులుండడంతో ఈ భూములు తమవేనని సుదీర్ఘకాలంగా మునిసిపాలిటీ పోరాటం చేస్తోంది. 10.06 ఎకరాల నుంచి 2,262 చదరపు గజాల స్థలాన్ని గజానికి రూ.5 చొప్పున బస్‌స్టాండ్‌ ఏర్పాటుకోసం ఏపీఎస్‌ ఆర్టీసీకి కేటాయిస్తూ రెవెన్యూ శాఖ 1964లో జీవో జారీ చేసింది.

ఈ భూముల్లో కొంత భాగాన్ని బస్‌ స్టాండ్‌ ఏర్పాటుకు, మిగిలిన భాగాన్ని షాపుల నిర్మాణానికి మునిసిపాలిటీ లీజుకు ఇచ్చింది. ఇవి ప్రభుత్వ భూములైనందున లీజుకు ఇచ్చేందుకు మునిసిపాలిటీకి ఎలాంటి హక్కులు లేవని 1983లో నల్లగొండ తహసీల్దార్‌ మరో నివేదిక సమర్పించారు. ఈ భూముల్లో నిర్మించిన దుకాణాలు, ఇళ్లను ఖాళీ చేయాలని అప్పట్లో నోటీసులు జారీ చేశారు. షాపుల యజమానులు హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు.

సర్వే నం.32లో ఉన్న 5 ఎకరాల పట్టా భూములను ప్రైవేటు వ్యక్తులనుంచి కొనుగోలు చేశామని కొందరు షాపుల యజమానులు సైతం న్యాయ స్థానాలను ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలతో 2015లో జిల్లా కలెక్టర్, మునిసిపల్‌ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించగా, ఆ సర్వే నంబర్‌లో 10.06 ఎకరాలకు బదులు 15.06 ఎకరాలున్నట్టుగా తేలింది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా దుకాణాలు నిర్మించుకుని జీవనోపాధి పొందుతున్న వ్యాపారస్తులకు ఈ భూములు క్రమబద్ధీకరించాలని జిల్లా కలెక్టర్‌ తన నివేదికలో సిఫారసు చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top