బతుకమ్మ చీరల పంపిణీకి సర్వం సిద్ధం

Ready For Bathukamma Sarees Distribution - Sakshi

నేడు నగరంలో లాంఛనంగా ప్రారంభం

అర్హులు 18 లక్షల మందికి పైనే

సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో బతుకమ్మ చీరల పంపిణీకి రంగం సిద్ధమైంది. బుధవారం బతుకమ్మ చీరల పంపిణీని లాంఛనంగా ప్రారంభించనున్నారు. సుమారు 18 లక్షలకు పైగా లబ్ధిదారులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయనున్నారు. గ్రేటర్‌ పరిధిలోని హైదరాబాద్‌లో  6.92 లక్షలు,  రంగారెడ్డి జిల్లా పరిధిలో 6.49లక్షలు, మేడ్చల్‌ జిల్లా పరి«ధిలో 4.87 లక్షలు మందిని అర్హులుగా గుర్తించారు. హైదరాబాద్‌ జిల్లాలోని 16 సర్కిళ్లలోని 632 కేంద్రాల్లో ఆహార భద్రత కార్డులు ఉన్న లబ్దిదారులకు  బతుకమ్మ చీరలు అందజేస్తారు. చీరల పంపిణీపై మంగళవారం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిషోర్‌ జోనల్, డిప్యూటీ కమిషనర్లు, డీపీఓలతో సమావేశం నిర్వహించారు.

బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి ప్రతి సర్కిళ్లలోని ఎంపికచేసిన ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్, శాసన సభ్యుడు, శాసన మండలి, పార్లమెంట్‌ సభ్యులు ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో చీరల పంపిణీ చేపట్టేందుకు చర్యలు తీసుకున్నారు. గత సంవత్సరం పంపిణీ చేసిన కేంద్రాల్లోనే ఈ ఏడాది కూడా చీరలు పంపిణీ చేయనున్నారు. అయితే ఏ కేంద్రంలో బతుకమ్మ చీరల పంపిణీ ఉంటుందో ఆయా కేంద్రాల వివరాలను లబ్దిదారులకు సంబంధిత డిప్యూటి కమిషనర్ల ద్వారా తెలియజేయనున్నారు. బతుకమ్మ చీరల పంపిణీలో వృద్ధులు, వికలాంగులకు ప్రాధాన్యం ఇస్తారు. పంపిణీ కేంద్రాల వద్ద తాగునీరు తదితర సౌకర్యాలను కల్పించడంతో పాటు పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు. పంపిణీ కేంద్రాల సంబందిత రేషన్‌ డీలర్ల సమన్వయంతో పంపిణీ చేయాలని కమిషనర్‌ స్పష్టం చేశారు.  హైదరాబాద్‌ జిల్లా పరిధిలో ఈ నెల 21 నుంచి 23 వరకు పూర్తిస్థాయిలో పంపిణీకి ప్రణాళికలు రూపొందించారు.  లబ్దిదారులకు ఏరోజు పంపిణీ చేస్తారో స్లిప్‌ల ద్వారా ముందస్తుగా సమాచారం అందిస్తారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top