
రాజీవ్ రహదారి పునర్నిర్మాణం
కరీంనగర్ సిటీ : ప్రమాదాలకు ఆలవాలంగా మారిన రాజీవ్హ్రదారి పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం పూనుకుంది.
కరీంనగర్ సిటీ :
ప్రమాదాలకు ఆలవాలంగా మారిన రాజీవ్హ్రదారి పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం పూనుకుంది. శుక్రవారం హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ రాజీవ్ రహదారిపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో లోపాభూయుష్టంగా ఉన్న ఈ రహదారిని రూ.750 కోట్లతో పునరుద్ధరించాలని నిర్ణయించారు. జిల్లాలో శనిగరం నుంచి గోదావరిఖని వరకు దాదాపు 117 కిలోమీటర్ల మేర రాజీవ్ రహదారి ఉంది. డబుల్ రోడ్డుగా ఉన్న రాజీవ్ రహదారిని నాలుగు లేన్ల రహదారిగా మార్చారు. ప్రస్తుతం ఈ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ఈ పనుల పట్ల అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తాయి.
జాతీయ రహదారుల ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించడం లేదని, కనీసం మూలమలుపులు కూడా తొలగించడం లేదని, కేవలం రోడ్డును నాలుగు లేన్లుగా వెడల్పు చేస్తున్నారంటూ తెలంగాణవాదులు, ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూలమలుపులు ఎక్కడా తొలగించకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రహదారి నిర్మాణ పనులపై అప్పట్లో జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ టి.భానుప్రసాద్‌రావు అధ్యక్షతన శాసనమండలి ఉప సంఘాన్ని కూడా ఏర్పాటు చేసింది.
ఈ ఉప సంఘం రహదారి వెంట పర్యటించి అనేక లోపాలు, అక్రమాలు ఉన్నట్లు నివేదిక ఇవ్వగా అది బుట్టదాఖలైంది. చివరకు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, మూలమలుపులు తొలగించాలని, అందుకు అనుగుణంగా విస్తరించాలని సీఎం నిర్ణయించడంతో రాజీవ్హ్రదారి స్వరూపం మారనుంది. ఇందులో భాగంగా పెద్దపల్లి, సుల్తానాబాద్ ప్రాంతంలో మౌలిక వసతి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దాదాపు 15 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే ఈ కేంద్రంలో వాహన పార్కింగ్‌తో పాటు, సేద తీరడానికి వసతి కల్పిస్తారు.