గాలికి వదిలేసిన నిబంధనలు
వాహన చోదకుల నిర్లక్ష్యం
కొందరు ఆర్టీఏ అధికారుల ఉదాసీన వైఖర
రహదారులపై ప్రమాదాలు.. గాల్లో ప్రాణాలు
సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీఏకు వచ్చే ప్రతి రవాణా వాహనానికి వేగ నియంత్రణ పరికరం ఉంటేనే ఫిట్‌నెస్‌ను ధ్రువీకరించాలి. రోడ్డు భద్రత దృష్ట్యా పదేళ్ల క్రితమే కేంద్రం ఈ నిబంధన తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఈ నిబంధన సమర్థంగా అమలుకు నోచడం లేదు. వాహన యజమానుల నిర్లక్ష్యం, కొంతమంది ఆర్టీఏ అధికారుల ఉదాసీనత కారణంగా ‘వేగ నియంత్రణ’పై నీలినీడలు కమ్ముకొన్నాయి.
దీంతో రవాణా వాహనాలు అన్ని రకాల రహదారులపై యథేచ్ఛగా పరిమితికి మించిన వేగంతో పరుగులు తీస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. రోడ్లపై రక్తపుటేరులు పారిస్తున్నాయి. ప్రతి ఏటా ఓవర్ స్పీడ్ కారణంగా జరుగుతున్న ప్రమాదాల సంఖ్య ఆందోళన కలిగిస్తున్నప్పటికీ.. రవాణా అధికారులు, పోలీసులు ఎలాంటి పటిష్టమైన చర్యలు చేపట్టడం లేదు. ఇటీవల రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ వద్ద చోటుచేసుకున్న ఆర్టీసీ బస్సు దుర్ఘటనకు టిప్పర్ ఓవర్‌లోడ్‌తో పాటు అతివేగం కూడా కారణమేనని రోడ్డు భద్రతా నిపుణులు పేర్కొంటున్నారు.
ఉన్నా, లేకున్నా ఓకే..
అన్ని రకాల రవాణా వాహనాలకు వేగాన్ని నియంత్రించే స్పీడ్ గవర్నర్స్‌ను 2015 అక్టోబర్ 1వ తేదీ నుంచి కేంద్రప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ మేరకు ఆ సంవత్సరం నుంచి తయారయ్యే వాహనాలు స్పీడ్ గవర్నర్‌లతోనే మార్కెట్‌లోకి విడుదల కావాలి. అప్పటికే రోడ్డెక్కిన వాహనాలకు మాత్రం తప్పనిసరిగా వేగ నియంత్రణ పరికరాలను ఏర్పాటు చేసుకోవాలి. 2015 నుంచే ఇది అమల్లోకి వచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లు ఆలస్యంగా 2019లో ఈ నిబంధనను అమల్లోకి తెచ్చింది. కొత్తగా వచ్చే వాటికి తయారీ సమయంలోనే వేగ నియంత్రణ పరికరాలను ఏర్పాటు చేస్తున్నందువల్ల పాత వాహనాలకు ఫిట్‌నెస్ సమయంలో వేగ నియంత్రణ పరికరాలను ఏర్పాటు చేసుకోవాలని షరతు విధించారు. కానీ ఈ నిబంధన అమల్లో పక్కదారి పట్టింది. కొంతమంది అధికారుల అక్రమార్జనకు స్పీడ్ గవర్నర్‌లు ఊతంగా మారాయి.
ఆటోమొబైల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఏఆర్‌ఏఐ), ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ వంటి సాంకేతిక సంస్థలు ధ్రువీకరించిన కంపెనీలకు చెందిన స్పీడ్ గవర్నర్స్‌ను మాత్రమే వాహనాలకు ఏర్పాటు చేయాలనే నిబంధన విధించారు. ఈ మేరకు 37 సంస్థలకు ఆమోదం లభించింది. కానీ తెలంగాణలో కేవలం 3 కంపెనీలకు చెందిన స్పీడ్ గవర్నర్స్ ఏర్పాటుకు మాత్రమే రవాణా అధికారులు అనుమతినిచ్చారు. ఆ మూడు సంస్థలతో ఒక అధికారి లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకొని పెద్ద ఎత్తున అక్రమార్జనకు పాల్పడ్డట్లు అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి.
సదరు అధికారి అండతో ఆ సంస్థలు సైతం స్పీడ్ గవర్నర్‌ల ధరలను అడ్డగోలుగా పెంచాయి. దీంతో వాహనదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. క్రమంగా ఈ పథకం లక్ష్యం నీరుగారింది. ఆ తర్వాత ఫిట్‌నెస్ పరీక్షల్లో ఈ పరికరాలు ఉన్నా, లేకున్నా సామర్థ్య నిర్ధారణ, ధ్రువీకరణ యథావిధిగా కొనసాగింది. మరోవైపు అధికారుల ఒత్తిడితో స్పీడ్‌గవర్నర్‌లను ఏర్పాటు చేసుకొన్న వాహనదారులు ఆ తర్వాత వాటిని తొలగించి యథావిధిగా దూకుడు పెంచారు.
గంటకు 80 కి.మీలకే పరిమితం..
👉కేంద్ర మోటారు వాహన చట్టంలోని 118వ నిబంధన ప్రకారం రవాణా వాహనాలు హైవేలపై గంటకు 80 కి.మీ.కంటే ఎక్కువ వేగంతో వెళ్లడానికి వీల్లేదు. గ్రేటర్ పరిధిలో గంటకు 60 కి.మీ. వేగంతో మాత్రమే నడపాలి.
👉అంబులెన్సులు, పోలీస్ వాహనాలు, ఫైరింజిన్‌లు, 8 మంది ప్రయాణికులు (3500 కిలోలు) కలిగిన వాహనాలకు మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుంది.
👉ఆర్టీసీ, స్కూల్ బస్సులు, ప్రైవేట్ బస్సులు, క్యాబ్‌లు, ట్యాంకర్లు, చెత్త తరలింపు వాహనాలు, లారీలు, డీసీఎంలు, తదితర అన్ని రకాల ప్రయాణికుల రవాణా, సరుకు రవాణా వాహనాలు తప్పనిసరిగా నిర్ణీత వేగాన్ని పాటించేలా స్పీడ్ గవర్నర్స్‌ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.
👉అపరిమితమైన వేగంతో దూసుకెళ్లే వాహనాలను అదుపు చేయడంలో డ్రైవర్లు విఫలం కావడంతోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది.
👉2015 తర్వాత తయారైన అన్ని రకాల రవాణా వాహనాలకు వాటి నిర్మాణ సమయంలోనే కంపెనీలు వేగాన్ని నియంత్రించే పరికరాలను ఏర్పాటు చేశాయి.
👉2015 కంటే ముందు తయారైన వాహనాలకు మాత్రం అలాంటి వేగ నియంత్రణ పరికరాలు లేవు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఈ స్పీడ్ గవర్నర్స్ నిబంధనను తప్పనిసరి చేశారు.


