దేశానికి, కాంగ్రెస్‌కు శుభపరిణామం

rahul becomes pm - Sakshi

పార్టీ అధ్యక్షుడిగా రాహుల్‌ నామినేషన్‌పై టీ కాంగ్రెస్‌

2019 ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌దే అధికారం: ఉత్తమ్‌

రాహుల్‌ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ 3 సెట్ల నామినేషన్ల దాఖలు

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ బాధ్యతలు చేపట్టనుండటం పార్టీకే కాకుండా యావత్‌ దేశానికి కూడా శుభ పరిణామమని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు వ్యాఖ్యానించారు. సోమవారం ఢిల్లీలోని ఏఐ సీసీ కార్యాలయంలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్‌గాంధీ నామినేషన్‌ వేశారు. ఈ సందర్భంగా టీకాంగ్రెస్‌ నేతలు కూడా రాహుల్‌ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ నామి నేషన్‌ పత్రాలను పార్టీ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి అందజేశారు.

సోమవారం గడువు ముగిసే సమయానికి ఇతర నేతలెవరూ నామినేషన్‌ దాఖలు చేయకపోవడంతో పార్టీ అధ్యక్షుడిగా రాహుల్‌గాంధీ ఎన్నిక లాంఛన ప్రాయమేనని నేతలు పేర్కొన్నారు. కాగా కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి నామినేషన్‌కు ముందు రాహుల్‌ గాంధీని కలసి శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణలో పార్టీ పరిస్థితిపై, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.

అధికారంలోకి వస్తాం..
రాహుల్‌ నామినేషన్‌ కార్యక్రమం అనంతరం టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇతర నేతలు మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ అధ్యక్ష పీఠాన్ని రాహుల్‌గాంధీ చేపట్ట నుండటం పార్టీతో పాటు దేశానికి శుభపరిణామమని ఉత్తమ్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్ర కాంగ్రెస్‌ తరఫున రాహుల్‌ అభ్యర్థి త్వాన్ని ప్రతిపాదిస్తూ 3 సెట్ల నామినేషన్లు దాఖలు చేశామన్నారు. కింది స్థాయి కార్యకర్త నుంచి నాయకుల వరకు అందరికీ రాహుల్‌ ఎన్నిక ఉత్తేజాన్ని కలిగిస్తోందని.. రాహుల్‌ నాయకత్వంపై అందరికీ పూర్తి విశ్వాసం ఉందని పేర్కొన్నారు.

ఇప్పటిదాకా వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలను రాహుల్‌గాంధీకి ఆపాదించడం సరికాదన్నారు. 2019 ఎన్నికల్లో రాహుల్‌ ఆధ్వర్యంలోని కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అభ్యుదయ భావాలతో దేశాన్ని ముందుకు నడపగలిగే సత్తా ఉన్న నేత రాహుల్‌ అని సీనియర్‌ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాహుల్‌ నాయ కత్వంలో పార్టీ ముందుముందు అత్యున్నత శిఖరాలకు చేరుకుంటుందని షబ్బీర్‌ అలీ ఆశాభావం వ్యక్తం చేశారు. రాహుల్‌ రాక కోసం పార్టీలోని యువత ఎంతగానో ఎదురు చూస్తున్నారని ఎమ్మెల్యే గీతారెడ్డి అన్నారు.

వారసత్వ రాజకీయంగా రాహుల్‌గాంధీ కాంగ్రెస్‌ అధ్యక్ష పీఠాన్ని చేపడుతున్నారన్న బీజేపీ విమర్శలను రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఖండించారు. దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబం నుంచి రాహుల్‌గాంధీ పార్టీ అధ్యక్ష పీఠానికి అర్హుడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ నేతలు పొన్నాల లక్ష్మయ్య, మర్రి శశిధర్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top