పీవీ ఎక్స్‌ప్రెస్‌ వన్‌ వే మూసివేత

PV Narasimha Rao Express Highway:One Way Allowed  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌ వే శనివారం నుంచి వన్‌వేగా మారనుంది. దీనికి నిర్వహిస్తున్న మరమ్మతుల నేపథ్యంలో కేవలం విమానాశ్రయం వైపు వెళ్లే వాహనాలనే అనుమతించనున్నట్లు అదనపు సీపీ (ట్రాఫిక్‌) అనిల్‌ కుమార్‌ తెలిపారు. విమానాశ్రయం వైపు నుంచి వచ్చే వాహనాలను అనుమతించబోమని పేర్కొన్నారు. ఎయిర్‌పోర్ట్‌ నుంచి వచ్చే వాహనాలు ఆరాంఘర్‌, శివరాంపల్లి, పీడీపీ ఎక్స్‌రోడ్‌, ఉప్పర్‌పల్లి, హైదర్‌గూడ, అత్తాపూర్‌, రేతిబౌలి, మోహదీపట్నం మీదగా వెళ్లాలని, అలాగే చాంద్రాయణగుట్ట, జూపార్క్‌ల వైపు నుంచి వచ్చే వాహనాలు అదే మార్గంలో ప్రయాణించాలని సూచించారు. దాదాపు 3 నెలల పాటు ఈ పనులు జరిగే అవకాశం ఉండటంతో వాహనదారులకు కొంత ఇబ్బంది ఉంటుందని హెచ్‌ఎండీఏ ఇంజనీరింగ్‌ విభాగ అధికారులు చెబుతున్నారు.  

వాహనదారుల భద్రత కోసమే...
11.6 కిలోమీటర్లు ఉన్న పీవీఎక్స్‌ప్రెస్‌ వేపై రోడ్డు కొంతమేర దెబ్బతినడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. నిర్ధారిత వేగంతో వెళ్లినా రోడ్డు బాగా లేక ప్రాణాలు కోల్పోతున్నారు. 2009, అక్టోబర్‌ 19 నుంచి వాహనదారులకు అందుబాటులోకి వచ్చిన ఈ ఎక్స్‌ప్రెస్‌ వే రోడ్ల మరమ్మతులు ఇప్పటివరకు చేయకపోవడం కూడా ప్రమాదాలకు కారణంగా తెలుస్తోంది. దీంతో ఎక్స్‌ప్రెస్‌ వేలోని పాత బీటీ రోడ్డు తొలగించి మిల్లింగ్‌తో కొత్త బీటీ రోడ్డు సోమవారం నుంచి వేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. సరోజినీదేవి కంటి ఆసుపత్రి నుంచి ఈ పనులను వన్‌వేలో పూర్తయ్యాక మళ్లీ మరో వన్‌వేలో వేసేలా ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రకారం ఈ 3 నెలల పాటు వన్‌వేలోనే శంషాబాద్‌ విమానాశ్రయానికి వాహనదారులను అనుమతించనున్నారు.  

ట్రాఫిక్‌ మళ్లింపు ఇలా...
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి హైదరాబాద్‌కు వచ్చే ప్రయాణికులు పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌వే కింది నుంచి ఆరాంఘర్, శివరాంపల్లి, పీడీపీ ఎక్స్‌రోడ్డు, ఉప్పర్‌పల్లి, హైదర్‌గూడ, అత్తాపూర్, రేతిబౌలి, మెహదీపట్నం మీదుగా రావాల్సి ఉంటుంది.
 చాంద్రాయణగుట్ట, జూపార్క్‌ రోడ్డు, శివరాంపల్లి నుంచి మెహదీపట్నం వచ్చే వాహనదారులు పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ వే కింది నుంచి శివరాంపల్లి, పీడీపీ ఎక్స్‌రోడ్డు, ఉప్పర్‌పల్లి, హైదర్‌గూడ, అత్తాపూర్, రేతిబౌలి నుంచి మెహదీపట్నానికి చేరుకోవాలి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top