కొనుగోలు లక్ష్యం 53 లక్షల టన్నులు

Purchase target is 53 lakh tonnes

ధాన్యం సేకరణ విధానాన్ని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌: ధాన్యం కొనుగోలులో అక్రమాలు, అవక తవకలకు తావులేకుండా పౌరసరఫరాల శాఖ 2017–18 సంవత్సరానికిగాను కొత్త పాలసీని రూపొందించింది. బియ్యం నాణ్యత, పరిమాణం, గోదాములపై ఎన్‌ఫోర్స్‌ మెంట్, టాస్క్‌ఫోర్స్‌ పర్యవేక్షణతో పాటు థర్డ్‌పార్టీ వెరిఫికే షన్, కొనుగోలు కేంద్రాల నుంచి గోనె సంచులు బయటికి తరలివెళ్లకుండా పలు నిబంధనలు విధించింది. మిల్లుల సామర్థ్యం మేరకు ధాన్యం కేటాయింపులు, పౌర సరఫరాల సంస్థకు సంబంధించి మిల్లర్ల లావాదేవీలను పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌ పరిధిలోకి తీసుకురానుంది.

ఫిర్యాదుల కోసం ట్రోల్‌ ఫ్రీ నంబర్లు 180042500333, 1967  ఏర్పాటు చేసింది. గతేడాది కంటే ఈ ఏడాది వరి ధాన్యం కనీస మద్దతు ధర సాధారణ రకానికి క్వింటాలుకు రూ.1,470 నుంచి రూ.1,550కి, గ్రేడ్‌–ఏ రకానికి క్వింటాలు కు రూ.1,510 నుంచి రూ.1,590కి పెంచుతూ, పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఎంత ధాన్యం వచ్చినా కొనుగోలు..
ఈ ఏడాది ఖరీఫ్‌లో 28 లక్షల టన్నులు, రబీలో 25 లక్షల టన్నులు మొత్తంగా కనీసం 53 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. ఇది తాత్కాలిక నిర్ణయమేనని, అంతకంటే ఎక్కువ ధాన్యం మార్కెట్‌కు వచ్చినా కొనుగోలు చేస్తామని తెలిపింది. ఖరీఫ్‌కు సంబంధించి వచ్చే వారంలో కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభం కానుందని పేర్కొంది. జాయింట్‌ కలెక్టర్‌ చైర్మన్‌ గా వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాలు, రవాణా, డీఆర్‌డీఏ, ఐటీడీఏ, ఎస్‌డబ్ల్యూసీ, సీడబ్ల్యూసీ విభాగాల జిల్లా స్థాయి అధికారులు సభ్యులుగా జిల్లా స్థాయిలో ధాన్యం సేకరణ కమిటీలు ఏర్పాటు కానున్నాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top