గరళానికి దూరంగా... | preaparations for cleaning of pair water sources | Sakshi
Sakshi News home page

గరళానికి దూరంగా...

Feb 18 2015 8:46 AM | Updated on Mar 23 2019 7:54 PM

గ్రేటర్ దాహార్తిని తీరుస్తున్న చారిత్రక జంట జలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ల పరిరక్షణకు జలమండలి కార్యాచరణ సిద్ధం చేసింది.

- జంట జలాశయాల పరిరక్షణకు ప్రణాళిక  సిద్ధం
- నెలరోజుల్లోగా మినీ ఎస్టీపీల
- నిర్మాణానికి 45 ఇంజినీరింగ్ కళాశాలలకు నోటీసులు..
- రూ.35 కోట్ల అంచనా వ్యయంతో సమీప గ్రామాల్లో ఎస్టీపీల నిర్మాణం..
- ఎన్‌జీఆర్‌ఐ సౌజన్యంతో జలాశయం సరిహద్దుల గుర్తింపు,
- డిజిటల్ మ్యాపుల తయారీ.. లేక్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటుకు వినతి


సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ దాహార్తిని తీరుస్తున్న చారిత్రక జంట జలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ల పరిరక్షణకు జలమండలి కార్యాచరణ సిద్ధం చేసింది. భవిష్యత్‌లో ఈ జలాశయాలు హుస్సేన్‌సాగర్‌లా గరళసాగరాలుగా మారకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఈ ప్రణాళికలో పొందుపరిచింది. జలాశయాల ఎగువ ప్రాంతాల్లో ఉన్న 45 ఇంజినీరింగ్ కళాశాలల నుంచి నిత్యం మురుగునీరు సాగరాల్లోకిచేరకుండా ఆయా కళాశాలల యాజమాన్యాలు సొంతంగా  చిన్నపాటి మురుగు శుద్ధి కేంద్రాల(మినీ ఎస్టీపీలు)ను నెలరోజుల వ్యవధిలోగా నిర్మించుకోవాలని తాజాగా పీసీబీ ఆధ్వర్యంలో నోటీసులు జారీ చేయించింది.

లేని పక్షంలో ఆయా కళాశాలలను మూసివేస్తామని హెచ్చరించినట్లు తెలిసింది. ఇక సమీపంలోని 12 గ్రామాల నుంచి వెలువడుతున్న మురుగునీరు సైతం జలాశయాల్లోకి చేరకుండా ఉండేందుకు రూ.35 కోట్ల అంచనా వ్యయంతో ఆయా గ్రామాల పరిధిలో మినీ ఎస్టీపీలను నిర్మించేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధంచేసి ప్రభుత్వానికి నివేదించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ పనులు చేపట్టనున్నట్లు జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి.   
 
 
ఎన్‌జీఆర్‌ఐ సౌజన్యంతో సరిహద్దుల గుర్తింపు..
సుమారు పదివేల కి.మీల సువిశాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ జలాశయాల సరిహద్దులు,జి.ఓ.111 ప్రకారం ఎగువ ప్రాంతాల్లో మరో పది కి.మీ పరిధి వరకు జలాశయాల సరిహద్దులను గుర్తించేందుకు జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ(ఎన్‌జీఆర్‌ఐ) సహాయం తీసుకోవాలని జలమండలి నిర్ణయించింది. జీఐఎస్,శాటిలైట్ చిత్రాలు, టోటల్ స్టేషన్ వంటి ఆధునిక సాంకేతికతో ఎన్‌జీఆర్‌ఐ సంస్థ సరిహద్దులను గుర్తించిన తరవాత డిజిటల్ మ్యాపులు సిద్ధంచేస్తారు. తద్వారా కబ్జాల నిరోధం, ఇసుక ఫిల్టర్లను నిర్వహిస్తున్న అసాంఘీక శక్తుల ఆటకట్టించవచ్చని జలమండలి వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రక్రియను చేపట్టాల్సిందిగా తాజాగా ఎన్‌జీఆర్‌ఐను సంప్రదించామని తెలిపాయి.
 
కృష్ణా నాలుగోదశతో జలకళ..
ఈ జలాశయాల నుంచి రోజువారీగా సుమారు 40 మిలియన్ గ్యాలన్ల నీటిని నగర తాగునీటి అవసరాలకు సేకరిస్తున్నారు. అయితే  వేసవిలో జలాశయాల్లో నీటి మట్టాలు తగ్గుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈనేపథ్యంలో కృష్ణా నాలుగోదశ ప్రాజెక్టు ద్వారా మహబూబ్‌నగర్ జిల్లా లక్ష్మీదేవి పేట నుంచి నగరానికి తరలించనున్న కృష్ణాజలాలతో వీటిని నింపేందుకు ప్రణాళిక సిద్ధంచేస్తున్నారు. ఇందుకు ప్రస్తుతం జలాశయంలో భారీగా పేరుకుపోయిన పూడికను తొలగించాలని నిర్ణయించారు. జంతు, వృక్ష అవశేషాలు ,గుర్రపుడెక్క తొలగింపు, జలాశయాల అడుగున పేరుకుపోయిన సిల్ట్‌ను తొలగించేందుకు రంగం సిద్ధంచేశారు. మరోవైపు నీటి రంగు మారకుండా జలాశయంలో ఏరియేషన్(ఆక్సిజన్‌స్థాయి పెంపునకు) వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement