పోస్టల్‌ బ్యాలెట్‌ దరఖాస్తుకు నేడే ఆఖరు తేదీ | Postal Ballot last date In Warangal | Sakshi
Sakshi News home page

పోస్టల్‌ బ్యాలెట్‌ దరఖాస్తుకు నేడే ఆఖరు తేదీ

Nov 30 2018 10:37 AM | Updated on Nov 30 2018 10:37 AM

Postal Ballot last date  In Warangal - Sakshi

సాక్షి , వరంగల్‌: రానున్న ఎన్నికల్లో ఉద్యోగుల ఓట్లపై పోటీలో ఉన్న అభ్యర్థులు దృష్టి సారించారు. పోలింగ్‌ గడువు సమీపిస్తుండడంతో ప్రచారంలో హడావుడిగా గడుపుతున్న అభ్యర్థులు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లపై ఓ కన్నేశారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల దరఖాస్తుకు శుక్రవారం వరకు మాత్రమే గడువు ఉంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు.. ఉద్యోగులను తమ దారికి తెచ్చుకునేందుకు వారి చుట్టూ ప్రదక్షిణలు మొదలెట్టారు. మరోవైపు వంద శాతం పోలింగ్‌ లక్ష్యంగా చర్యలు చేపడుతున్న ఎన్నికల కమిషన్‌ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ప్రతి ఉద్యోగి తప్పక ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచిస్తోంది. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేసింది. కాగా, పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు సైతం గెలుపును ప్రభావితం చేసేలా కనిపిస్తున్నాయి. దీంతో వారిని రాజకీయ పార్టీలు అనుకూలంగా మలుచుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రధాన పార్టీలు తమ మేనిఫెస్టోలో ఉద్యోగులకు అనుకూలంగా ఉండే తాయిలాలను ప్రకటిస్తూ మచ్చిక చేసుకునే పనిలో ఉన్నాయి.

17,820 మంది ఉద్యోగులు.. 
ఉమ్మడి జిల్లాలో 17,820 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో ఎక్కువగా రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, ఎన్జీవోలు, ఉపాధ్యాయులు ఉన్నారు. వీరందరూ ఖజానా శాఖ పరిధిలో వేతనాలు పొందేవారే. వీరు కాకుండా ఆర్టీసీ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైన బీఎస్‌ఎన్‌ఎల్, పోస్టల్, సింగరేణి ఉద్యోగులు కూడా ఉన్నారు. వీరందరికీ జిల్లా ఎన్నికల అధికారులు పోలింగ్‌ బాధ్యతలను అప్పగించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ‘కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం’ (సీపీఎస్‌)ను రద్దు చేయాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు కొంత కాలంగా పోరాటాలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి అనుకూలంగా తమవంతు సహకారం చేస్తామని ప్రధాన పార్టీలు ఇప్పటికే ప్రకటించాయి.

అలాగే పీఆర్సీ, మధ్యంతర భృతిపై కూడా ఉద్యోగులు ఆశతో ఉన్నారు. దీంతో పాటు ఉద్యోగ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచాలని కొంత కాలంగా డిమాండ్‌ వినిపిస్తోంది. తమ డిమాండ్లకు అనుకూలంగా ప్రధాన పార్టీలు మేనిఫెస్టోలో ప్రకటించాలని సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తూ వచ్చారు. అన్ని పార్టీల నాయకులు సీపీఎస్‌ విషయమై సానుకూలంగా స్పంది స్తామని సంకేతాలు ఇవ్వడంతో అసలు ఉద్యోగులు ఏ పార్టీని నమ్మి ఓట్లు వేస్తారో తెలియని ప రిస్థితి నెలకొంది. తమ డిమాండ్లను పరిష్కరించే విధంగా ఏ పార్టీ మేనిఫెస్టో ఉంటుందో వారి వైపే ఉద్యోగులు ఆకర్షితులయ్యే అవకాశాలున్నాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

ఈ నెల 30తో గడువు పూర్తి.. 
ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం ఈనెల 30 వరకు దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించారు. ఈ నెలాఖరులోగా దరఖాస్తులు సమర్పిస్తే సమయానికి వారి చేతికి పత్రాలు అందించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు ఉమ్మడి  పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం 9,995 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఒక నియోజకవర్గంలోని సిబ్బంది అదే అసెంబ్లీ పరిధిలో పోలింగ్‌ విధులు నిర్వర్తిస్తే పోస్టల్‌ బ్యాలెట్‌ అప్పుడే ఇస్తామని, ఇతర నియోజకవర్గంలో పోలింగ్‌ బాధ్యతలు ఉంటే పోస్ట్‌ ద్వారా లేదా ఆర్వోకు డ్యూటీ ఆర్డర్‌ కాపీతో పాటు పోస్టల్‌ బ్యాలెట్‌ను పంపిస్తామని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఇందుకు ఎన్నికల సిబ్బంది డ్యూటీ ఆర్డర్లను కూడా సిద్ధం చేస్తున్నారు. పోలింగ్‌ విధుల్లో పాల్గొనే సిబ్బంది  శుక్రవారంలోపు పోస్టల్‌ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకోకుంటే ఓటు వినియోగించుకోవడం కష్టమని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. 

అభ్యర్థుల ఆశలు.. 
గత ఎన్నికల పోలింగ్‌ సరళిని పరిశీలిస్తే.. ఉద్యోగులు ఎన్నికల విధుల్లో ఉంటున్నందున ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నట్లు తెలు స్తోంది. ముఖ్యంగా పోలీస్‌ సిబ్బంది ఓటు హక్కు వినియోగానికి అవకాశం దొరకడం లేదని సమాచారం. ఓటు వినియోగించుకున్న సిబ్బంది సైతం పోస్టల్‌ బ్యాలెట్‌పై అనుమానాస్పదంగా మార్క్‌ చేయడంతో కొన్ని ఓట్లు చెల్లకుండా పోతున్నాయి. అయితే ఎన్నికల కమిషన్‌ పోలింగ్‌ శాతం పె ంపుపై దృష్టి సారించింది. దీంతో ఈసారి ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లే అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించే శక్తిగా మారే అవకాశం లేకపోలే దు. రాజకీయ పార్టీలు.. ఉద్యోగుల డిమాండ్లకు సానుకూలంగా స్పందిస్తూ వారిని మచ్చిక చేసుకునే పనిలో ఉంటున్నట్లు తెలుస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement