మినీ బండ్‌లు కలేనా..!

Ponds Works Pending In Warangal - Sakshi

సాక్షి, వరంగల్‌ రూరల్‌: చెరువులకు వన్నె తెచ్చేవి మినీ ట్యాంక్‌ బండ్‌లు.. ఆనందానికి, ఆహ్లాదానికి కేరాఫ్‌ అడ్రస్‌గా ఉన్న వీటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రతి నియోజకవర్గంలో ఒక చెరువును ఎంపిక చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని నిర్ణయం తీసుకుంది. జిల్లాలో నర్సంపేట నియోజకవర్గంలో నర్సంపేట మండలంలోని మాదన్నపేట చెరువు, పరకాల నియోజకవర్గంలో పరకాల మండలంలోని దామెర చెరువులను మినీ బండ్‌లుగా తీర్చిదిద్దాలని అధికారులు నిర్ణయించారు. 2015–2016 సంవత్సరంలో వీటికి టెండర్‌లు పిలిచి నిధులు మంజూరు చేశారు. అదే ఏడు పనులను ప్రారంభించారు.

దామెర చెరువు..
పరకాల పట్టణానికి సుమారు 100 మీటర్ల దూరంలో దామెర చెరువు ఉంది. 2015–2016 సంవత్సరంలో ఈ చెరువును మిషన్‌ కాకతీయ పనుల్లో భాగంగా మినీ ట్యాంక్‌ బండ్‌గా అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేశారు. చెరువును అభివృద్ధి చేసేందుకు 1.92 కోట్లకు టెండర్‌ పిలువగా మూడు శాతం ఎక్కువకు ఓ కాంట్రాక్టర్‌ దక్కించుకున్నాడు. అగ్రిమెంట్‌ ప్రకారం 2.8 కిలోమీటర్ల బండ్, రెండు తూములు, 900 మీటర్ల మెయిన్‌ బండ్, మెట్లు, కట్ట చుట్టూ రాతి కట్టడం, మత్తి పనులు పూర్తి చేయాలి. తొలుత వేసిన ఎస్టిమేషన్‌ సరిగ్గా లేకపోవడంతో రీ ఎస్టిమేషన్‌ కోసం అధికారులు ప్రతిపాదించారు.

ఈ సంవత్సరం ఫిబ్రవరి 27న దామెర చెరువుకు రూ 3.08 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. ఈ లెక్క ప్రకారం బండ్‌ పనులకు రూ 5.59 కోట్లు మంజూరైనట్లు. నిధులు ఫుల్‌గానే మంజూరైనా పనులు మాత్రం అంతంతమాత్రంగానే జరిగినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. కట్టకు ఆనుకుని రాతి కట్టడం 800 మీటర్లు కట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు 450 మీటర్ల వరకే కట్టారు. అగ్రిమెంట్‌ అయిన తొమ్మిది నెలలకే పనులు పూర్తి చేయాలి కానీ సదరు కంట్రాక్టర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మాదన్నపేట చెరువుమాదన్నపేట చెరువును 200 సంవత్సరాల క్రితం అక్కన్న– మాదన్నలు నిర్మించారు. చెరువు సామర్థ్యం మొత్తం 17 ఫీట్లు.

ఆయకట్టు అధికారికంగా మూడువేల ఎకరాలు కాగా అనధికారంగా మరో 1500 ఎకరాలు సాగవుతోంది. ఈ చెరువు చెరువు పరిసర ప్రాంతాల్లో పచ్చదనం, ఆహ్లాదకరంగా పర్యాటకులను ఆకర్షించే విధంగా ఉంటుంది. నర్సంపేట నియోజకవర్గంలో మాధన్నపేట చెరువుకు 2015–2016 సంవత్సరంలో మిషన్‌ కాకతీయలో భాగంగా మినీ ట్యాంక్‌ బండ్‌ను మంజూరు చేశారు.

రూ 7.51 కోట్లు నిధులు మంజూరు చేశారు. దీనిని ఓ కన్‌స్ట్రక్షన్‌వారు దక్కించుకున్నారు. చెరువు బండ్‌ పనులకు నిధులు మంజూరై ఏడాదిన్నర గడిచినా ఇంతవరకూ పనులు పూర్తి కాలేదు. అగ్రిమెంట్‌ ప్రకారం 2017 మే వరకు పూర్తి చేయాల్సి ఉంది. కాని అధికారులు పనుల పురోగతిపై పట్టించుకోకపోవడంతో సదరు కాంట్రాక్టర్‌ పనులు పూర్తి చేయడం లేదనే ఆరోపణలు బాహాటంగానే వినిపిస్తున్నాయి.

త్వరలో పూర్తి చేస్తాం..
మినీ ట్యాంక్‌ బండ్‌ల పనులు త్వరలో పూర్తవుతాయి. జిల్లాలో పరకాల మండలం దామెర చెరువు, నర్సంపేట మండలం మాదన్నపేట చెరువులను మినీ ట్యాంక్‌ బండ్‌ ఎంపిక చేశారు. పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. ఆలస్యం కాకుండా పూర్తి చేస్తాం.  –శ్రవణ్, ఇరిగేషన్‌ ఈఈ, రూరల్‌ జిల్లా

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top