గెలుపే లక్ష్యం

Political Parties Targets To Win In Panchayat Elections - Sakshi

శాసనసభ ఎన్నికల్లో సంగారెడ్డి మినహా మిగతా నాలుగు అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందిన టీఆర్‌ఎస్‌.. పంచాయతీ ఎన్నికలపైనా దృష్టి సారించింది. పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే లోక్‌సభ ఎన్నికలు జరగనుండడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడిన క్రియాశీల కార్యకర్తలు, నాయకులకు ప్రాధాన్యత ఇస్తూనే, గెలుపే లక్ష్యంగా సర్పంచ్, వార్డు స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దించేలా వ్యూహం సిద్ధం చేస్తోంది. రిజర్వేషన్‌ కోటాకు అనుగుణంగా సంబంధిత కేటగిరీలో బలమైన అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యతలను ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారు. – సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి

గ్రామ పంచాయతీ ఎన్నికలను జనవరి నెలాఖరులోగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు వేగవంతం చేసింది. ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలకమైన రిజర్వేషన్ల ఖరారు అంశం కొలిక్కిరాగా, నేడో రేపో గ్రామ పంచాయతీల వారీగా వివరాలు విడుదల చేయనున్నారు. జిల్లాలోని 647 గ్రామ పంచాయతీ సర్పంచ్‌ స్థానాలు, 5,778 వార్డు సభ్యుల ఎన్నిక జరగనుండడంతో గ్రామ స్థాయిలో రాజకీయం వేడెక్కింది. రాజకీయ పార్టీలు, వాటి గుర్తులతో సంబంధం లేకుండా ఎన్నికలు జరుగుతుండడంతో గ్రామాలపై పట్టు నిలపుకొనేందుకు అన్ని రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీ సాధించిన టీఆర్‌ఎస్‌..

ఐదేళ్ల పాటు గ్రామ స్థాయిలో పాలన సజావుగా సాగేందుకు తమ పార్టీ మద్దతుదారులు సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల్లో తమ పార్టీ మద్దతుదారులు ఉండాలని కోరుకుంటోంది. దీంతో గ్రామ పంచాయతీ రాజకీయాలపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా దృష్టి సారించారు. జిల్లాలో సంగారెడ్డి మినహా, మిగతా నాలుగు అసెంబ్లీ స్థానాల్లోనూ టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన నేతలే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తమకు గ్రామ స్థాయిలో అండగా నిలబడిన వారితో పాటు, తమకు విధేయులుగా ఉండేవారిని బరిలోకి దించా లని టీఆర్‌ఎస్‌ శాసనసభ్యులు యోచిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేయడంతో పాటు, ప్రజాదరణ, ఆర్థిక వనరులు ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ అధిష్టానం నుంచి ఎమ్మెల్యేలకు ఆదేశాలు అందినట్లు సమాచారం. ఏదేని రిజర్వుడు కేటగిరీలో ప్రజాదరణ ఉండి, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కార్యకర్తలకు అవసరమైన ఆర్థిక భారం చేయాల్సిందిగా ఎమ్మెల్యేలకు సూచించి నట్లు సమాచారం.

ఎంపీలు, ఎమ్మెల్సీలకూ బాధ్యత?
ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, ఆర్థిక సాయం, ప్రచారం తదితర అంశాల్లో ఎంపీలు కూడా బాధ్యతలు తీసుకోవాలని టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఆదేశించినట్లు సమాచారం. గ్రామ స్థాయిలో పదవుల కోసం పార్టీలోనే అంతర్గతంగా నేతలు, కార్యకర్తల నడుమ పోరు తీవ్రంగా ఉండే అవకాశం ఉండడంతో, పార్టీ తరఫున ఒకే వ్యక్తి పోటీలో ఉండేలా చూడాలని నిర్ణయించారు. అదే సమయంలో అవకాశం దక్కని కేడర్‌ పార్టీని వీడకుండా జాగ్రత్తలు తీసుకోవాలనే వ్యూహంతో ఎమ్మెల్యేలు ఉన్నారు. గ్రామ పంచాయతీల వారీగా రిజర్వేషన్ల వివరాలు అధికారికంగా వెలువడిన వెంటనే, రిజర్వుడు కేటగిరీని అనుసరించి గ్రామాల వారీగా బలమైన అభ్యర్థుల జాబితాను తయారు చేసే పనిలో టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు ఉన్నారు.

పంచాయతీ ఎన్నికల్లో పార్టీ కేడర్‌లో సమన్వయం లోపం తలెత్తితే లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ప్రభావం ఉంటుందనే కోణంలో పార్టీ ఎమ్మెల్యేలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు, ఎమ్మెల్సీలకు కూడా ప్రచారం, సమన్వయ బాధ్యతలు అప్పగిం చడం ద్వారా మెరుగైన ఫలితాలు రాబట్టాలనే యోచనలో టీఆర్‌ఎస్‌ నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీకి పట్టున్న గ్రామ పంచాయతీల్లో ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నించాలని, సాధ్యం కాని పక్షంలో బలమైన అభ్యర్థిని బరిలోకి దించాలని టీఆర్‌ఎస్‌ నాయకత్వం భావిస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top