
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న రెండు టీఎంసీల నీటిని తరలించే వ్యవస్థకు తోడు అదనంగా మూడో టీఎంసీ నీటి తరలింపునకు అయ్యే అంచనా వ్యయాలను నీటిపారుదలశాఖ సిద్ధం చేసింది. గతంలో సొరంగ మార్గాల ద్వారా నీటిని తరలించేలా సిద్ధం చేసిన ప్రతిపాదనలను పక్కనపెట్టి సీఎం సూచన మేరకు పైప్‌లైన్ వ్యవస్థ ద్వారా నీటిని తరలించేలా ప్రణాళిక రూపొందించింది. అదనపు టీఎంసీ నీటి తరలింపునకు మిడ్‌మానేరు మొదలు మల్లన్నసాగర్ వరకు రూ. 14,430 కోట్ల మేర ఖర్చవుతుందన్న అంచనాతో సీఎంకు నివేదిక సమర్పించింది.
వచ్చే ఏడాదికే అదనపు టీఎంసీ...
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రెండు టీఎంసీలను తరలించేలా కసరత్తు జరుగుతున్న సమయంలోనే మరో టీఎంసీ నీటిని తరలించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి గతంలోనే ఆదేశించారు. ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లలో అదనపు మోటార్ల ఏర్పాటు పనులకు సంబంధించిన అంచనా వ్యయాలు సమర్పించగా వాటికి పరిపాలనా అనుమతులు వచ్చాయి. మిడ్‌మానేరు నుంచి మల్లన్నసాగర్ వరకు ఒక టీఎంసీ నీటిని గ్రావిటీ కాల్వలు, సొరంగాల ద్వారా తరలించాలని నిర్ణయించారు. ఈ నీటి తరలింపునకు 35.55 కి.మీల సొరంగాలు తవ్వాల్సి వస్తోంది. రెండు అండర్‌గ్రౌండ్ పంప్‌హౌస్‌లు నిర్మాంచాలని ప్రతిపాదించారు.
దీనికి రూ. 12,594 కోట్లు అంచనా వేసి పరిపాలనా అనుమతులు ఇచ్చారు. అయితే సొరంగాల నిర్మాణానికి భారీగా భూసేకరణ అవసరం ఉండటంతోపాటు సొరంగాల తవ్వకానికి రెండున్నరేళ్ల సమయం పట్టే అవకాశం ఉండటంతో ఈ ప్రతిపాదనను పక్కనపెట్టి పైప్‌లైన్ వ్యవస్థ ద్వారా నీటిని తరలించేలా అధ్యయనం చేయాలని సూచించారు. పైప్‌లైన్ ద్వారా అయితే భూసేకరణ అవసరాలు తగ్గుతాయని, నిర్మాణాన్ని సైతం వచ్చే ఏడాదికి పూర్తి చేసి నీటిని తరలించవచ్చని సీఎం సూచించారు. దీనికి తగ్గట్లుగా ప్రస్తుతం ఇంజనీర్లు నివేదిక రూపొందించి శుక్రవారం ప్రగతి భవన్‌లో నీటిపారుదలశాఖ సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రికి అందజేశారు. పైప్‌లైన్ వ్యవస్థ నిర్మాణంలో భాగంగా గ్రావిటీ కెనాల్, మూడు ఓపెన్ పంప్‌హౌస్‌లు, 16.35 కి.మీల ప్రెషర్ మెయిన్‌లు నిర్మించాలని ప్రతిపాదించారు. ఈ వ్యవస్థ నిర్మాణానికి మిడ్‌మానేరు నుంచి అనంతగిరి రిజర్వాయర్ వరకు రూ. 4,147 కోట్లు, అనంతగిరి నుంచి మల్లన్నసాగర్ వరకు రూ. 10,283 కోట్లు ఖర్చవుతుందని తేల్చారు. గతంలో సొరంగ వ్యవస్థల నిర్మాణంతో పోలిస్తే అదనంగా రూ.1,836 కోట్ల మేర వ్యయం కానుంది. ఈ ప్రతిపాదనకు సీఎం ఆమోదం తెలిపినట్లుగా తెలిసింది. దీంతో త్వరలోనే పరిపాలనా అనుమతులు రానున్నాయి.