మెట్రో జర్నీ ఎంతో హాయి

People Prefer Metro journey in Summer - Sakshi

నాంపల్లి: రోజు రోజుకూ ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుతున్నాయి. ఇంట్లోంచి బయటకు రావాలంటేనే ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండలో ప్రయాణం చేయాలంటే జంకుతున్నారు. నగరంలో ఎక్కువగా రవాణాకు ఆర్టీసీతో పాటుగా ఎంఎంటిఎస్‌ రైళ్లు, ఆటోలు, క్యాబ్, ఓలా వంటి వాహనాలు ఉన్నప్పటికి ప్రయాణంలో వేడి నుంచి ఉపశమనం పొందడానికి మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు.  మెట్రో రైల్వే స్టేషన్లలో సౌకర్యాలు మెరుగ్గా ఉండటం చేత రాకపోకలు సులభంగా సాగిస్తున్నారు. 

రద్దీగా మెట్రో రైల్వే స్టేషన్లు...  
మెట్రో రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. స్టేషన్లలో ప్రయాణించే మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. రైలులో కూర్చోవడానికి కూడా వీలులేనంతగా ఎక్కేస్తున్నారు. సుదూర ప్రయాణమైనా నిల్చొని ప్రయాణిస్తున్నారు. మియాపుర్‌ నుంచి ఎల్బీనగర్‌కు వెళ్లే రైళ్లన్నీ రద్దీగానే రాకపోకలు సాగిస్తున్నాయి. రైళ్లలో ఏసీని వినియోగించడం, రైల్వే స్టేషన్లలో లిప్టులు, ఎస్కలేటర్లు, మంచినీరు, ఏటీఎం,  పార్కింగ్‌ వంటి సౌకర్యాలను సమకూర్చడంతోనే ఎక్కువ మంది మెట్రో రైళ్లలో ప్రయాణం సాగిస్తున్నారు. 

ఆర్టీసీ బస్సుల్లో తగ్గిన జనం...
ఎండలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య బాగా తగ్గుతోంది. మిట్ట మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు చాలా వరకు బస్సులు ఖాళీగానే రాకపోకలు సాగిస్తున్నాయి. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.  రోడ్లపై ఉండే బస్టాపుల పరిస్థితి అలాగే ఉంది. ఈ డొక్కు బస్సుల్లో ప్రయాణించలేమని పేర్కొంటున్నారు. బస్సు ఎక్కితే ఉక్కపోత తప్పదంటున్నారు. కిటికీలు సైతం సరిగా ఉండటం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు ఆర్టీసీ బస్సులు ఎప్పుడు రద్దీగా ఉంటాయో తెలియదు.. ఎప్పుడు ఖాళీగా వెళయో తెలియని పరిస్థితుల్లో సగటు ప్రయాణికుడు అసౌకర్యానికి గురవుతున్నారు. దీంతో మెట్రోలో  డబ్బులు ఎక్కువైనా సరే ఏసీలో ప్రయాణిస్తూ గమ్యాన్ని చేరుకుంటున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాయిగా ప్రయాణం ముగించుకుంటూ ఇంట్లోకి చేరుతున్నారు.  

ఎండలో ఎంతో హాయినిస్తోంది
ఎండకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయలేకున్నాం. ఆటోలో వెళ్తే వడగాల్పులు వీస్తున్నాయి. ఎండకు వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది.  ఆరోగాన్ని కాపాడుకోవాలంటే మెట్రో రైలు ఎంతో మేలు. అందుకే  మెట్రో రైలులో వెళ్తాను. హాయిగా ఇంటికి చేరుకుంటాను. మరో పక్షం రోజులు పరిస్థితి ఇలానే ప్రయాణించక తప్పడం లేదు.      –  ప్రదీప్‌ కుమార్, ప్రయాణికుడు  

ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నా  మెట్రో రైలు ప్రయాణించడం ద్వారా సమయాన్ని ఆదా చేసుకుంటున్నా. అంతేకాదు ఎండకు ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నా. సాధారణ రోజుల్లో ఆర్టీసీలో వెళితే ట్రాఫిక్‌ సమస్య వస్తుంది. వేసవి కాలంలో ఆర్టీసీలో ప్రయాణించే సదుపాయాలే ఉండవు. ఇలాంటి పరిస్థితుల్లో మెట్రో రైలు నాలాంటి వారికి ఎంతో ఉపయోగపడుతుంది.      – రషీద్, ప్రయాణికుడు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top