జాతరకు పెద్దగట్టు ముస్తాబు

Peddagattu Decorated For The Fest - Sakshi

నేటి నుంచి 28 వరకు లింగమంతులస్వామి జాతర 

యాదవుల ఆరాధ్య దైవం లింగమంతుల స్వామి 

రాష్ట్రంలో సమ్మక్క, సారలమ్మల తర్వాత పెద్ద జాతర 

రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరలిరానున్న భక్తులు 

సాక్షిప్రతినిధి, సూర్యాపేట: యాదవుల ఆరాధ్య దైవం కొలువుండే గొల్ల (పెద్ద) గట్టు.. లింగమంతులస్వామి జాతరకు ముస్తాబైంది. ఆదివారం నుంచి ఈనెల 28 వరకు జాతర జరగనుంది. గట్టుపై లింగమంతులస్వామి ఆలయానికి రంగులు వేయడం, ఆలయం చుట్టూ చలువ పందిళ్లు, గట్టు కింద భక్తుల సౌకర్యార్థం చేపట్టిన పనులు పూర్తయ్యాయి. సూర్యాపేట జిల్లా కేంద్రానికి 10 కి.మీ దూరంలో హైదరాబాద్‌ – విజయవాడ జాతీయ రహదారి పక్కనే దురాజ్‌పల్లి వద్ద పెద్దగట్టుపై లింగమంతులస్వామి ఆలయం ఉంది. ఈ జాతరకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున యాదవులు తరలిరానుండటంతో అధికార యంత్రాంగం జాతరకు కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది.  

సమ్మక్క జాతర తర్వాత అతిపెద్దది..  
సమ్మక్క, సారలమ్మల జాతర తర్వాత అతిపెద్దదిగా గొల్లగట్టు లింగమంతులస్వామి జాతరకు పేరుంది. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్‌ జిల్లాలు, అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. పూర్వకాలంలో యాదవరాజులు ఉండ్రుగొండ గుట్ట మీద శివాలయం, లక్ష్మీనర్సింహస్వామి, లింగమంతుల స్వామి, చౌడమ్మ తల్లి, ఆంజనేయుడి దేవాలయాలు కట్టించారని పెద్దలు చెబుతుంటారు.  

ఆదివారం రాత్రితో ప్రారంభం.. 
సూర్యాపేట మండలం కేసారం గ్రామం నుంచి చౌడమ్మ తల్లి ఉన్న దేవరపెట్టెను తీసుకొని యాదవ, రెడ్డి కులస్తులు కాలినడకన బయలుదేరి దురాజ్‌పల్లిలో ఉన్న గొల్లగట్టు (పెద్దగట్టు)కు ఆదివారం రాత్రి చేరుకుంటారు. అనంతరం పూజలతో మొదటి రోజు ఘట్టం పూర్తవుతుంది. రెండో రోజు బోనాలు, మూడో రోజు చంద్రపట్నం, నాలుగో రోజు నెలవారం, ఆతర్వాత ఐదోరోజు జాతర ముగుస్తుంది.  

రూ.1.71 కోట్లతో అభివృద్ధి పనులు.. 
జాతరకు ప్రభుత్వం ఈ సారి ప్రత్యేకంగా రూ.1.71 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో నూతనంగా కల్యాణ కట్ట, పూజారుల గదులు, విశ్రాంతి గదుల నిర్మాణం, మరుగుదొడ్లు, పారిశుధ్య నిర్వాహణకు ఏర్పాట్లు చేశారు. భక్తులు మంచినీటికి ఇబ్బందులు పడకుండా జాతీయ రహదారికి సమీపంలో ఉన్న ఇమాంపేట మిషన్‌ భగీరథ ప్లాంట్‌ నుంచి పెద్దగట్టుకు ప్రత్యేకంగా పైపులైన్‌ వేశారు. గుట్ట కింద ఖాసీంపేట దారిలో గత ఏడాది కోనేటిని నిర్మించారు. కాగా, మూసీ కాలువ పరిధిలో గట్టుకు చుట్టు పక్కల ఉన్న చెరువుల్లో నీళ్లు అడుగంటాయి. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఈ చెరువులను మూసీ కాలువతో నింపాలని మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రాజెక్టు అధికారులను రెండు రోజుల క్రితం ఆదేశించారు. దీంతో ఈ చెరువులకు నీటిని విడుదల చేశారు. సూర్యాపేట మున్సిపాలిటీ పారిశుధ్య నిర్వాహణకు 240 మంది సిబ్బందిని కేటాయించింది. జాతర ప్రాంతంలో మొత్తం ఏడు వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు.  

జాతీయ రహదారి పక్కన ఆర్టీసీ బస్టాండ్‌.. 
గుట్ట కింద జాతీయ రహదారి పక్కనే ఆర్టీసీ బస్సులను నిలిపేందుకు బస్టాండ్‌ ఏర్పాటు చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ, సూర్యాపేట, కోదాడ డిపోల నుంచి 85 బస్సులను జాతరకు స్పెషల్‌గా నడుపనున్నారు. అలాగే భక్తులకు ఎలాంటి పార్కింగ్‌ సమస్య లేకుండా మొత్తం మూడు చోట్ల 50 ఎకరాల్లో ప్రైవేటు వాహనాలకు పార్కింగ్‌ స్థలాలను గుర్తించారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకుగాను 1200 మంది పోలీసులు బందోబస్తు చేపడుతున్నారు. 46 సీసీ కెమెరాలతో జాతరను పోలీస్‌ అధికారులు పర్యవేక్షించనున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top