దుబ్బాకలో రసవత్తర ‘పోరు’

Participating Campaigns In Dubhaka - Sakshi

గెలుపుపై ధీమాగా సోలిపేట 

నాలుగేళ్ల అభివృద్ధిపై ఆశలు  

సర్వశక్తులు ఒడ్డుతున్న ప్రతిపక్షాలు  

అయోమయంలో కూటమి కార్యకర్తలు  

దుబ్బాకటౌన్‌: దుబ్బాక నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గెలుపు కోసం ప్రధాన పార్టీల అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ప్రచార పర్వం ముగియడంతో నియోజకవర్గంలో ఒక్కసారిగా ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఇప్పటివరకు పోటాపోటీగా ప్రచారం చేపట్టిన పార్టీలు ప్రచార గడువు ముగియడంతో తెరవెనుక రాజకీయాలు నడిపిస్తున్నారు. పోలింగ్‌కు కేవలం ఒక్కరోజు మాత్రమే వ్యవధి ఉండటంతో ప్రధాన పార్టీలు ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు మరింత జోరుగా చొచ్చుకుని వెళ్తున్నారు. గ్రామాల్లో ఏమాత్రం సమయాన్ని వృథా చేయకుండా ప్రధాన పార్టీల నాయకులు ఎత్తుకు పైఎత్తులు వేస్తూ తమకే ఓట్లు పడేలా విశ్వప్రయత్నాలు చేయడంలో తలమునకలయ్యారు.  

నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఎన్నికలపైనే జోరుగా చర్చలు సాగుతున్నాయి. గ్రామాల్లో నలుగురు కలిసిన చోట.. ప్రధాన కూడళ్లు.. హోటళ్లు.. పొలం పనుల దగ్గర ఇలా ఎక్కడ చూసినా ఎన్నికల గురించే చర్చ. ఎవరు గెలుస్తారు.. మీ ఊర్లో ఎట్లుంది.. ఏ పార్టీకి ఓట్లు వేస్తారన్న చర్చలే నడుస్తున్నాయి. దుబ్బాక నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డికి మొదటి విడతలోనే టికెట్‌ కేటాయించడంతో ఇప్పటికే గ్రామాలన్నీ చుట్టివచ్చారు. అన్ని గ్రామాల్లో పర్యటించి ప్రజలను ఓట్లు వేయాలని అభ్యర్థించారు. బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్‌రావుకు సైతం బీజేపీ అధిష్టానం మొదటి విడతలోనే టికెట్‌ కేటాయించడంతో ఆయన నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేపట్టారు. మహాకూటమి పొత్తులో భాగంగా దుబ్బాకను టీజేఎస్‌కు కేటాయించడంతో ఆ పార్టీ తరఫున చిందం రాజ్‌కుమార్‌ బరిలో ఉండటం.. నాటకీయ పరిణామాల నేపథ్యంలో నామినేషన్ల ఘట్టం చివరిరోజున కాంగ్రెస్‌ పార్టీ నుంచి మద్దుల నాగేశ్వర్‌రెడ్డి టికెట్‌ తెచ్చుకుని ప్రచారం చేపట్టడం జరిగిపోయింది.  

అభివృద్ధితో దూసుకుపోయిన సోలిపేట 
దుబ్బాక నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి ప్రచారంలో దూసుకపోయారు. తాగేందుకు గుక్కెడు నీళ్లు దొరకని నియోజకవర్గంలో మిషన్‌ భగీరథ పథకం ద్వారా రూ. 500 కోట్లతో ఇంటింటికీ స్వచ్ఛమైన గోదావరి జలాలు అందించడం, రూ.8 వేల కోట్లతో మల్లన్నసాగర్‌ రిజర్వాయర్, పంటకాలువల నిర్మాణం, మల్లన్నసాగర్‌తో నియోజకవర్గంలో లక్షా 35 వేల ఎకరాలకు సాగునీరు అందించే పనులు, రూ.160 కోట్లతో 160 చెరువల అభివృద్ధి, రాష్ట్రంలోనే 4 వేల డబుల్‌ బెడ్రూంల నిర్మాణాలతో అగ్రస్థానంలో ఉండటం, ఇప్పటికే 2 వేల ఇండ్ల నిర్మాణం చివరి దశలో ఉన్నాయని, దుబ్బాకలో 100 పడకల ఆసుపత్రి, రూ. 10 కోట్లతో సీఎం కేసీఆర్‌ చదువుకున్న బడి నిర్మాణం, రూ.17 కోట్లతో సమీకృత భవన సముదాయం, 7 కొత్త రెసిడెన్షియల్‌ పాఠశాలలు, నార్సింగ్, రాయపోల్‌ కొత్త మండలాలు, 21 కొత్త గ్రామపంచాయతీలతో పాటు రెండువేలకు పైగా వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని ప్రజలకు వివరిస్తూ చేపట్టిన ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో రామలింగారెడ్డి ఉన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా దుబ్బాక నియోజకవర్గంలోనే పింఛన్లు వస్తుండటంతో రామలింగారెడ్డి భారీ మోజార్టీతో గెలుస్తానన్న ధీమాతో ఉన్నారు. 

ప్రభుత్వ వ్యతిరేకతపై ప్రతిపక్షాల్లో ఆశలు 
నాలుగేళ్ల అభివృద్ధిపై సోలిపేట రామలింగారెడ్డి ప్రచారం చేస్తుండగా.. ప్రతిపక్ష బీజేపీ, కూటమి అభ్యర్థులు మాత్రం ప్రభుత్వ వ్యతిరేకతే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్లారు. అభివృద్ధి, సంక్షేమం ఆయుధాలుగా బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్‌రావు ప్రచారం చేశారు. ఆయన తరఫున బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కూడా బరిలోకి దిగడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపైంది. దాంతోపాటు రాష్ట్ర నాయకుడు కిషన్‌రెడ్డి కూడా రఘునందన్‌రావు తరఫున దుబ్బాకలో పర్యటించారు. ఆయన్ను గెలిపిస్తే మంచి నాయకుడు అవుతాడని ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

కాగా మహాకూటమి మాత్రం టీఆర్‌ఎస్‌ కుటుంబ పాలనపై గురి పెట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యంగా విమర్శలు ఎక్కుపెట్టింది.  కాగా ఈ సీటును పొత్తుల్లో భాగంగా టీజేఎస్‌కు కేటాయించినా కాంగ్రెస్‌ తరఫున మద్దుల నాగేశ్వర్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో ఉండటంతో కూటమి పార్టీల కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. ఎవరికి మద్దతు ఇవ్వాలో అర్థంకాక కొందరు ఇంటికే పరిమితం అవుతుండటం కూడా కూటమికి పెద్ద దెబ్బగానే చెప్పవచ్చు. ఏదేమైనా విజయం ఎవరిని వరిస్తుందో.. ఏ పార్టీల ప్రభావం ఎంత ఉందో తెలియాలంటే ఈనెల 11వ తేదీ వరకు ఆగాల్సిందే.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top