పంచాయతీ కార్మికులను పర్మనెంట్‌ చేయాలి | Panchayat workers should be permanent | Sakshi
Sakshi News home page

పంచాయతీ కార్మికులను పర్మనెంట్‌ చేయాలి

Aug 12 2018 2:11 AM | Updated on Jul 29 2019 2:51 PM

Panchayat workers should be permanent - Sakshi

పంచాయతీ కార్మికుల ఆత్మగౌరవ సభలో అభివాదం చేస్తున్న నాయకులు

హైదరాబాద్‌: గ్రామాభివృద్ధికి, గ్రామపారిశుధ్యానికి నిత్యం శ్రమించే పంచాయతీ పారిశుధ్య ఉద్యోగులు, కార్మికులను పర్మనెంట్‌ చేయాలని బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. వేతనాలు పెంచాలని, ఉద్యోగాలను పర్మనెంట్‌ చేయాలని, అర్హులను గ్రామకార్యదర్శులుగా నియమించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఎల్‌బీనగర్‌లోని మినీ ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ లో శనివారం జరిగిన ఆత్మగౌరవ పోరాట సభలో ఆయన మాట్లాడారు. గ్రామాలను మల్లెపూవులాగా తీర్చిదిద్దేది పంచాయతీ కార్మికులు, ఉద్యోగులేనని, వారికి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే రాష్ట్ర ఖజానా నుంచి పంచాయతీ ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని కోరారు. పంచాయతీ ఉద్యోగులు ఓటర్లను ప్రభావితం చేసే శక్తివంతులని, వారి పొట్ట కొట్టినవాడు గాలిలో కలుస్తాడన్నారు. పంచాయతీ ఉద్యోగులు, కార్మికులను పర్మనెంట్‌ చేయకపోతే ఉద్య మాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.  

కేటీఆర్‌ మోసం చేశారు: సున్నం రాజయ్య 
2015లో గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె సమయంలో పంచాయతీరాజ్‌ మంత్రిగా ఉన్న కేటీఆర్‌ అన్ని రాజకీయపక్షాలు, ప్రజాసంఘాల సమక్షంలో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని ఎమ్మెల్యే సున్నం రాజయ్య దుయ్యబట్టారు. కార్మికుల పక్షాన కలసి వచ్చే పార్టీలతో అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చి పోరాటం చేస్తామన్నారు. నెలల తరబడి జీతాల్లేక కార్మికులు వెట్టి చాకిరీ చేస్తున్నారని, తెలంగాణలో పంచాయతీ కార్మికుల ఆత్మగౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. 44 రోజులుగా పంచాయతీ కార్మికులు దీక్షలు చేస్తుంటే సీఎం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ అన్నారు.

పంచాయతీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి 18 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాజ్యాంగం ప్రకారం వెట్టి ఉండటానికి వీల్లేదని, పంచాయతీ కార్మికులు మాత్రం వెట్టిబతుకు బతకాల్సి వస్తోందని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా వేతనాలు ఇచ్చుకోండని ప్రభుత్వం పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. వర్షం కురుస్తున్నా పంచాయతీ కార్మికులు లెక్కచేయకుండా సభకు హాజరై వక్తల ప్రసంగాలకు జేజేలు పలికారు. కార్యక్రమంలో సీఐటీయూ నేతలు సాయిబాబు, పాలడుగు భాస్కర్, బీసీ సంక్షేమ సంఘం నేత గుజ్జ రమేష్, టీజీపీయూఎస్‌ రాష్ట్ర సలహాదారు నల్లా రాధాకృష్ణ, చిక్కుడు ప్రభాకర్, స్కైలాబ్‌బాబు, సౌదాని భూమన్నయాదవ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement