బలహీనతలు అధిగమించండి 

Overcome the weaknesses - Sakshi

రాష్ట్ర పార్టీకి సీపీఎం జాతీయ నాయకత్వం ఆదేశాలు

రాష్ట్ర పార్టీ ప్లీనరీలో సీతారాం ఏచూరి, కారత్‌ దిశానిర్దేశం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పార్టీ సంస్థాగతంగా ఎదుర్కొంటున్న బలహీనతలు, లోటుపాట్లను అధిగమించేందుకు వెంటనే అవసరమైన కార్యాచరణను చేపట్టాలని రాష్ట్ర నాయకత్వాన్ని సీపీఎం జాతీయ నాయకత్వం ఆదేశించింది. కిందిస్థాయి నుంచి పార్టీ బలపడేందుకు, సొంత బలం పెంచుకునేందుకు రాబోయే మూడునెలల పాటు వివిధ రూపాల్లో కార్యక్రమాలను నిర్వహించాలని సూచించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేదలు, వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసి, వాటిపై ఆందోళనలు, ఉద్యమాలు రూపొందించుకోవాలని దిశానిర్దేశం చేసింది. పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టి, సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు, వివిధ స్థాయిల్లోని నాయకులు, కార్యకర్తలకు మారిన పరిస్థితుల్లో సైద్ధాంతిక అంశాలు, పార్టీ భావజలాన్ని అర్థమయ్యేలా వివరించాలని సూచించింది. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రాష్ట్ర పార్టీ ప్లీనం సమావేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాశ్‌ కారత్‌ హాజరై రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలకు పలు సూచనలు చేసినట్టు సమాచారం.

యువతకు దగ్గర కావ డంతోపాటు పార్టీ భావజాల వ్యాప్తికి సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకోవడంలో వైఫల్యాలను అధిగమించాలని సూచించింది. ఎలాంటి కార్యాచరణను చేపట్టాలనే దానిపై పూర్తిస్థాయిలో అధ్య యనం నిర్వహించాలని ఆదేశించింది. రాష్ట్ర అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఏమాత్రం ప్రభావం చూపకపోవడం, సంప్రదాయ ఓటర్లుగా, మద్దతునిస్తూ పార్టీకి సహకరిస్తున్న వివిధ వర్గాలు దూరం కావడం, బడుగు వర్గాలుసైతం పార్టీపై అనాసక్తి కనబర్చడంపై లోతైన ఆత్మపరిశీలన చేసుకుని ఆ మేరకు రాజకీయ వ్యూహాలు మార్చుకోవాలని రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించినట్టు తెలుస్తోంది. ఎన్నికల ఫలితా ల సమీక్షకు సంబంధించిన నివేదికలను రాష్ట్రనాయకులకు అందజేసినట్టు సమాచారం. ఏళ్లుగా పార్టీకి సంప్రదాయ ఓటుబ్యాంక్, మద్దతుదారులుగా ఉన్న రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మికవర్గం ఇతర వర్గాలు ఎందుకు దూరమవుతున్నారనే అంశంపై లోతైన విశ్లేషణ చేయాలని సూచించింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top