‘ఓడి’పోవాల్సిదే!

Other Duties Business In TS RTC Hyderabad - Sakshi

ఆర్టీసీలో ఇతర విధుల (ఓడీ) దందా

ఎండీ అనుమతి లేకుండానే సిబ్బంది బదిలీ  

కండక్టర్, డ్రైవర్లకు ఇష్టారాజ్యంగా అనుమతులు

పదోన్నతులకు దూరమవుతున్న సీనియర్లు

సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్‌ ఆర్టీసీలో ఓడీల(అదర్‌ డ్యూటీస్‌) దందా జోరుగా సాగుతోంది.సాధారణంగా దీర్ఘకాలిక అనారోగ్యంతోబాధపడుతున్న కండక్టర్, డ్రైవర్లకు రన్నింగ్‌ డ్యూటీ నుంచి కొంతకాలం మినహాయింపు ఇచ్చేందుకు ‘ఇతర విధుల’కు బదిలీ చేస్తారు. కేవలం ఎండీ స్థాయిలో మాత్రమే జరగాల్సినఓడీ (అదర్‌ డ్యూటీ).. ఇటీవలఎండీ అనుమతులు లేకుండానే డిపో మేనేజర్లు, రీజనల్‌ మేనేజర్ల స్థాయిలో ఎడాపెడా జరిగిపోతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓడీ బదిలీ పొందిన వారు ఆరు నెలల్లో తిరిగి తమ పూర్వ విధుల్లో చేరాల్సి ఉండగా.. చాలా మంది ఓడీ విధుల పునరుద్ధరణ లేకుండానే ఏళ్ల తరబడి అదే ఓడీ పైనే కొనసాగుతున్నారు. దీంతో   ప్రతి డిపోలో సీనియర్ల పదోన్నతులకు గండి పడుతోంది. ఏళ్ల తరబడి కండక్టర్లు, డ్రైవర్లుగా పనిచేసిన వారు ఎలాంటి పదోన్నతి లేకుండానే ఉద్యోగ విరమణ చేయాల్సి వస్తోందని కొన్ని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

ఓడీ నిబంధనలు ఇవీ..
సాధారణంగా ధీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఉద్యోగులకు మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు ఓడీ ఇచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత కూడా వారు అనారోగ్యంతో బాధపడుతున్నట్టయితే ఎండీ మరికొంత కాలం పాటు పొడిగిస్తారు. అనారోగ్యంతో బస్సులు నడపలేని డ్రైవర్లు, టికెట్లు ఇవ్వలేని కండక్టర్లకు ఈ అవకాశం కల్పిస్తారు. ఓడీ బదిలీ పొందిన వారు డిపోల్లో, బస్టేషన్లలోను, బస్టాపుల్లో కంట్రోలర్లు, పాయింట్‌మెన్‌గా సాధారణ విధుల్లో కొనసాగుతారు. కొందరు క్లర్క్‌లుగా పనిచేస్తారు. డిపో మేనేజర్లు తమ అవసరాలకు అనుగుణంగా ఇతరత్రా విధులను కూడా వీరికి అప్పగిస్తారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారితో పాటు, ప్రతి డిపోలో ఒకరిద్దరు సీనియర్లకు ‘నాన్‌ మెడికల్‌’ కేటగిరీ కింద ఓడీ పొందే అవకాశం ఉంటుంది. అయితే ఎలాంటి ఓడీ అయినా పొందాలంటే మాత్రం ఎండీ అనుమతి తప్పనిసరిగా ఉండాల్సిందే. కానీ ఇక్కడ అవేమీ పట్టించుకోకుండా కిందిస్థాయిలోనే ఓడీలు ఇచ్చేస్తున్నారు. 

అర్హత ఉన్నా సున్నే..
ఏకపక్షంగా జరుగుతున్న ఈ వ్యవహారంలో ప్రధాన కార్మిక సంఘాలకు చెందిన కొందరు నాయకులే అడ్డగోలు బదిలీల కోసం అధికారులపై ఒత్తిళ్లు తెస్తున్నట్లు సమాచారం. మెడికల్, నాన్‌ మెడికల్‌ కేటగిరీల్లో తమకు నచ్చిన వారికి ఓడీ ఇచ్చేవిధంగా ఒత్తిడి తెస్తున్నారు. దీంతో నిజంగా అనారోగ్యంతో బాధపడుతూ  ఓడీ కోసం ఎదురు చూస్తున్న వారికి అవకాశం లభించడం లేదు. గుండె జబ్బులు, వెన్నునొప్పి, పక్షవాతం వంటి రోగాలతో బాధపడుతున్న వారికి వైద్యుల సూచన మేరకు ఓడీ ఇవ్వాలి. ఇలాంటి ఉద్యోగులు నెలల తరబడి అధికారులు చుట్టూ  తిరుగుతుండగా, కేవలం కార్మిక సంఘాలు సూచించిన వారికి మాత్రమే క్షణాల్లో ఓడీలు ఇచ్చేస్తున్నారని, అర్హత ఉన్నవారికి మాత్రం అన్యాయం జరుగుతోందని వివిధ డిపోలకు చెందిన సీనియర్‌ డ్రైవర్లు, కండక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘20 ఏళ్లుగా పనిచేస్తున్న వారికి ఎలాంటి పదోన్నతులు లేవు. కేవలం డ్రైవర్, కండక్టర్‌గానే ఉన్నారు. చివరకు అలాగే ఉద్యోగ విరమణ చేస్తున్నారు. కానీ అధికారుల ప్రాపకంతో, కార్మిక సంఘాల మద్ధతు ఉన్నవారికి ఎలాంటి సీనియారిటీ లేకున్నా, అనారోగ్యం లేకపోయినా ఓడీ ఇచ్చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం’ అని కుషాయిగూడ డిపోకు చెందిన ఓ డ్రైవర్‌ ఆవేదన వ్యక్తంచేశారు. ఆ డిపోలో పనిచేస్తున్న ఓ జూనియర్‌ మహిళా కండక్టర్‌కు ఈసీఐఎల్‌ బస్‌స్టేషన్‌లో పాయింట్‌ డ్యూటీ అప్పగించడంపట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క కుషాయిగూడలోనే కాకుండా నగరంలోని 29 డిపోల్లోనూ ఓడీల్లో నిబంధనలు పాటించడం లేదని కండక్టర్లు, డ్రైవర్లు చెబుతున్నారు.  

కార్మిక నేతలు కాకున్నా ‘రిలీఫ్‌’
ప్రతి డిపోలో కార్మిక సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులకు ‘రిలీఫ్‌’నిస్తారు. కార్మికుల సమస్యల కోసం, సంఘాల అవసరాల కోసం ఇలా వారు చేసే విధుల నుంచి రిలీఫ్‌ను పొందడం కార్మిక సంఘాల హక్కుల్లో భాగమే. కానీ కార్మిక సంఘాల  నాయకత్వంలో లేనివారు కూడా ఆయా సంఘాల ప్రతినిధులుగా కొనసాగుతూ విధులకు గైర్హాజరుగుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి డిపోలో కనీసం 20 మంది కండక్టర్లు, డ్రైవర్లు ఇలా విధులకు డుమ్మా కొడుతున్నట్టు సమాచారం.  

స్తంభిస్తున్న సర్వీసులు
అసలే సిబ్బంది కొరతతో నగరంలో ప్రతిరోజు వేల కొద్దీ ట్రిప్పులు నిలిచిపోతున్నాయి. ఇక ఇలాంటి సంస్థాగతమైన లోపాలు అందుకు మరింత కారణమవుతున్నాయి. ప్రతి డిపోలో పెద్ద సంఖ్యలో సర్వీసులు నిలిచిపోవడంతో సాయంత్రం సెకండ్‌ షిఫ్టు ట్రిప్పులకు బ్రేక్‌ పడుతోంది. దీంతో ఎప్పుడొస్తుందో, అసలు వస్తుందో రాదో తెలియని బస్సుల కోసం లక్షలాది మంది ప్రయాణికులు బస్టాపుల్లో పడిగాపులు కాస్తున్నారు. పీకల్లోతు నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీకి  ప్రయాణికుల నిరాదరణ, మెట్రో రైలు రాక మరిన్ని నష్టాలను తెచ్చిపెడుతోంది. దీనికి ఓడీ దందా మరింత తోడవుతోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top