ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్‌కు కరోనా పాజిటివ్‌

Nizamabad Rural MLA Bajireddy Govardhan tests positive for Covid-19 - Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : తెలంగాణలో మరో ఎమ్మెల్యే కరోనా బారినపడ్డారు. ఇప్పటికే జనగాం నియోజకవర్గ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కరోనా వైరస్‌ సోకడంతో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్‌కి కరోనా సోకడంతో ఆయన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ బయల్దేరారు. (హైదరాబాద్లో దడ పుట్టిస్తున్న కరోనా)

కాగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డితో వారం కిందటే బాజిరెడ్డి ప్రైమరీ కాంటాక్ట్‌ అయ్యారు. అంతేకాకుండా మూడు రోజుల నుంచి ఎమ్మెల్యే బాజిరెడ్డి దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో నిన్న బాజిరెడ్డి గోవర్ధన్‌తో పాటు, ఆయన భార్యకు కరోనా పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో బాజిరెడ్డికి పాజిటివ్‌, భార్యకు నెగెటివ్‌ రావడంతో ఆయన కుటుంబసభ్యులు షాక్‌కు గురయ్యారు. మరోవైపు ఎమ్మెల్యే కుటుంబసభ్యులు స్వీయ నిర్భందంలోకి వెళ్లారు. (టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి కరోనా పాజిటివ్‌)

ప్రైమరీ కాంటాక్ట్‌ల వివరాలు సేకరణ
ఎమ్మెల్యే బాజిరెడ్డికి కరోనా పాజిటివ్‌ రావడంతో ఆయనతో ప్రైమరీ కాంటాక్ట్‌ అయినవారి వివరాలను వైద్యాధికారులు, సిబ్బంది సేకరిస్తున్నారు. డిచ్‌పల్లి మండలం బీబీపూర్‌ తండాలో నిన్న (శనివారం) డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. 50 గృహాలను లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేసి వారికి ఇళ్ల పట్టాలు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. దీంతో ఎవరెవరు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top