పాతికేళ్లకే పాలనాపగ్గాలు!

Nittu Jahnavi Elected As Kamareddy Municipal Chair Person - Sakshi

ఆమె వయసు పాతికేళ్లు.. ఎంఏ, బీఈడీ పూర్తి చేసి, న్యాయవిద్య అభ్యసిస్తూనే సివిల్స్‌ లక్ష్యంగా సాగుతోంది. అంతలోనే మున్సిపల్‌ ఎన్నికలు రావడం.. చైర్‌పర్సన్‌ స్థానం మహిళకు రిజర్వ్‌ కావడంతో తండ్రి కోరిక మేరకు రాజకీయాల్లోకి వచ్చింది. బల్దియా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచింది. అతిచిన్న వయసులోనే కామారెడ్డి బల్దియా చైర్మన్‌ అయిన నిట్టు జాహ్నవి ప్రస్థానం.. 

సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి బల్దియా చైర్‌పర్సన్‌గా ఎన్నికైన నిట్టు జాహ్నవి 1995 ఆగస్టు 13న జన్మించారు. ఆమె తాత నిట్టు విఠల్‌రావ్‌ ఉపాధ్యాయ వృత్తిలో రిటైర్‌ అయ్యారు. తల్లి కరుణశ్రీ స్కూల్‌ అసిస్టెంట్‌గా, ఇన్‌చార్జీ హెచ్‌ఎంగా పనిచేస్తున్నారు. తండ్రి నిట్టు వేణుగోపాల్‌రావ్‌ మున్సిపల్‌ కౌన్సిలర్‌గా పలు పర్యాయాలు పనిచేశారు. బాబాయ్‌ కృష్ణమోహన్‌ కౌన్సిలర్‌గా, కో ఆప్షన్‌ సభ్యుడిగా పనిచేశారు. ఇప్పుడు జాహ్నవితో పాటు బాబాయ్‌ కూడా కౌన్సిలర్‌గా గెలుపొందారు.

టార్గెట్‌ సివిల్స్‌....
ఎంఏ బీఈడీ పూర్తి చేసిన జాహ్నవి.. ప్రస్తుతం హైదరాబాద్‌లోని పడాల రామిరెడ్డి లా కాలేజీలో న్యాయ విద్యనభ్యసిస్తున్నారు. ప్రజలకు సేవలందించేందుకు ఐఏఎస్‌ ఆఫీసర్‌ లేదా ఐపీఎస్‌ ఆఫీసర్‌ కావాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. లా చదువకుంటూనే సివిల్స్‌కు సిద్ధమవుతున్న జాహ్నవి.. అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు. జాహ్నవి తండ్రి నిట్టు వేణుగోపాల్‌రావ్‌ రెండున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ఆయన పలుమార్లు కౌన్సిలర్‌గా పనిచేశారు. ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు.

టీఆర్‌ఎస్‌లో చేరిన తరువాత ఏదైనా కార్పొరేషన్‌ పదవి లభిస్తుందని ఆశించారు. ఇంతలో మున్సిపల్‌ ఎన్నికలు రావడం, చెర్మన్‌ పదవి మహిళకు రిజర్వు కావడంతో ఆయన తన కూతురును రాజకీయాల్లోకి రావాలని కోరారు. సివిల్స్‌ సర్వీసెస్‌ అంటే ఇష్టంగా ప్రిపేర్‌ అవుతున్న జాహ్నవి.. తండ్రి కోరిక మేరకు ప్రజా సేవ చేసేందుకు వచ్చారు. 33వ వార్డునుంచి పోటీ చేసి గెలిచారు. చైర్‌పర్సన్‌గా ఎన్నికైన జాహ్నవి.. తన లక్ష్యం సివిల్స్‌ అని, వచ్చే ఏడాది సివిల్స్‌ రాస్తానని పేర్కొంటున్నారు.

నాన్నే స్ఫూర్తి..
నాన్న స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చాను. అమ్మ, తాత, నానమ్మ, బాబాయిల ప్రోత్సాహమూ ఉంది. సివిల్‌ సర్వీసెస్‌కు సిద్ధమవుతున్న నాకు ఈ ఐదేళ్ల ప్రజా సేవ కూడా సర్వీస్‌లాంటిదే.. నాన్న, బాబాయిలు రాజకీయాల్లో ఉన్నారు. చిన్ననాటి నుంచి వారిని గమనిస్తున్నా. రాజకీయాల్లో రాణించడానికి నాన్న రాజకీయ అనుభవం ఉపయోగపడుతుంది. ఆయన సూచనలతో ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తా. పట్టణంలో ప్రధాన సమస్య పారిశుధ్యలోపమే.. ప్రజలను చైతన్యపరిచి పారిశుధ్య సమస్య పరిష్కారానికి కృషి చేస్తా. బల్దియాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా. స్వచ్ఛ కామారెడ్డిగా తీర్చిదిద్దడానికి ప్రజలు సహకరించాలి.
– నిట్టు జాహ్నవి, చైర్‌పర్సన్, కామారెడ్డి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top