హాస్టల్‌ విద్యార్థి మృతికి ‘నిట్‌’దే బాధ్యత | Sakshi
Sakshi News home page

హాస్టల్‌ విద్యార్థి మృతికి ‘నిట్‌’దే బాధ్యత

Published Sun, Nov 19 2017 2:15 AM

NIT warangal is responsible for the hostel student's death - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వరంగల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌)లో బీటెక్‌ మూడో ఏడాది చదివే రాజశేఖర్‌ మృతికి ఆ సంస్థదే బాధ్యతని తేల్చినట్లు రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ ప్రకటించింది. 2011 డిసెంబర్‌ 9న అమర్లపూడి రాజశేఖర్‌ క్రికెట్‌ ఆడుతూ లక్కవరం చెరువులో పడి మరణించ డానికి నిట్‌ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని ఫోరం ఈ తీర్పు వెలువరించింది. మృతుడి తల్లిదండ్రులకు రూ.9.70 లక్షలు పరిహారం చెల్లించాలని కమిషన్‌ చైర్మన్‌ బీఎన్‌ రావు నల్లా, సభ్యుడు పాటిల్‌ విఠల్‌రావుతో కూడిన డివిజన్‌ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రాజశేఖర్‌ తల్లిదండ్రులు అమర్లపూడి శ్యాంరావు, జ్యోతి దాఖలు చేసిన ఫిర్యాదును విచారించిన కమిషన్‌ ఇటీవల ఈ తీర్పు చెప్పింది. 

‘‘హాస్టల్‌ నుంచి విద్యార్థులు బయటకు వెళ్లేటప్పుడు వార్డెన్‌ రిజిస్టర్‌ నిర్వహించాలి. విద్యార్థులు బయటకు ఎప్పుడు వెళ్లారు, ఎందుకు వెళ్లారు, ఎవరి అనుమతి పొంది వెళ్లారు, తిరిగి ఎప్పుడు హాస్టల్‌కు వచ్చారు.. వంటి వివరాలతో కూడిన రిజిస్టర్‌ విధిగా నిర్వహించాలి. అయితే నిట్‌ హాస్టల్‌లో రిజిస్టర్‌ ఉందో లేదో తెలియని పరిస్థితి ఉందంటే యాజమాన్యం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. మృతుడు రాజశేఖర్‌ తల్లిదండ్రులు దిల్‌సుఖ్‌నగర్‌లో కూలీలుగా పనిచేస్తున్నారు కాబట్టి వారి ఆదాయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలన్న వాదన సరికాదు. నిట్‌ వంటి సంస్థలో బీటెక్‌ సీటుకు అర్హత పొందిన విద్యార్థి రాజశేఖర్‌కు కూడా ఆర్జన లేకపోవచ్చు. రాజశేఖర్‌ బతికి ఉంటే భవిష్యత్‌లో ఆర్జించబోయే ఆదాయం, కంప్యూటర్‌ కోర్సులకు ఉన్న డిమాండ్‌లను పరిగణనలోకి తీసుకోవాలి. నెలకు కనీసం రూ. పది వేలు జీతంతో కూడిన ఉద్యోగం ఉన్నట్లుగా అంచనా వేసి మోటారు వాహనాల చట్టం కింద పరిహారాన్ని రూ.9.70 లక్షలుగా నిర్ణయించాం. ఈ మొత్తంలో మృతుడి తల్లికి రూ.6.40 లక్షలు, తండ్రికి రూ.3.30 లక్షలు చొప్పున చెల్లించాలి. కేసు ఖర్చుల నిమిత్తం అదనంగా రూ.5 వేలు కూడా నిట్‌ యాజమాన్యం చెల్లించాలి’’అని వినియోగదారుల కమిషన్‌ తన తీర్పులో పేర్కొంది.  

ఆరేళ్ల న్యాయపోరాటంలో విజయం
నిట్‌ హాస్టల్‌ నుంచి రాజశేఖర్‌తోపాటు మరో 12 మంది విద్యార్థులు క్రికెట్‌ ఆడేందుకు బయటకు వెళ్లారని, క్రికెట్‌ బాల్‌ చెరువులో పడటంతో తీసేందుకు వెళ్లిన రాజశేఖర్‌ ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడని, ఇందులో తమ సంస్థ నిర్లక్ష్యం లేదని నిట్‌ యాజమాన్యం చేసిన వాదనను కమిషన్‌ తోసిపుచ్చింది. రాజశేఖర్‌ తొందరపాటు చర్య వల్లే మరణించినట్లుగా నిట్‌ ఏర్పాటు చేసిన కమిటీ కూడా తేల్చిందని, మానవీయకోణంలో మృతుడి కుటుంబానికి రూ. లక్ష పరిహారం చెల్లించేందుకు సిద్ధమని నిట్‌ చేసిన వాదన వీగిపోయింది. తమ కుమారుడు రాజశేఖర్‌ మృతితో ఏర్పడిన మానసిక క్షోభకు రూ.10 లక్షలు, పరిహారంగా రూ.15 లక్షలు, అంత్యక్రియలు, రవాణా ఇతర ఖర్చుల నిమిత్తం రూ.లక్ష కలిసి మొత్తం రూ.26 లక్షలు ఇప్పించాలని తల్లిదండ్రులు శ్యాంరావు, జ్యోతి న్యాయపోరాటంలో ఆరేళ్లకు విజయం సాధించారు. 

Advertisement
Advertisement