కొత్త పద్ధతిలో ఇసుక పంపిణీ | new method for Distribution of sand | Sakshi
Sakshi News home page

కొత్త పద్ధతిలో ఇసుక పంపిణీ

Feb 19 2015 4:40 AM | Updated on Sep 28 2018 7:14 PM

కొత్త విధానం ప్రకారం సరైన పద్ధతిలో ఇసుక పంపిణీకి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సహకరించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖామంత్రి టి.హరీశ్‌రావు సూచించారు.

- జిల్లాలో 8 క్వారీలకు అనుమతి
- రాష్ట్ర నీటిపారుదల శాఖామంత్రి టి.హరీశ్‌రావు

ప్రగతినగర్ : కొత్త విధానం ప్రకారం సరైన పద్ధతిలో ఇసుక పంపిణీకి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు సహకరించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖామంత్రి టి.హరీశ్‌రావు సూచించారు. ఇసుక పాలసీపై బుధవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్పరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. జిల్లాలో 8క్వారీలలో ఇసుకను తీయడానికి అనుమతికి ప్రతిపాదించామన్నారు. ఐదు పట్టా భూముల్లో అనుమతించినట్లు చెప్పారు. ఈ పట్టా భూముల నుంచి తీసిన ఇసుకను స్టాక్‌పాయింట్‌లలో ఉంచి అనుమతించిన వారికి పాసులు జారీ చేయడం జరుగుతుందన్నారు.

ఇసుక క్వారీలున్న గ్రామాలకు క్యూబిక్ మీటర్‌కు రూ.3 చొప్పున, జిల్లాకు రూ.4 చొప్పున సీనరేజ్ చార్జీలు చెల్లించడం జరగుతుందన్నారు. తద్వారా ఆయా గ్రామాలలో స్థానికంగా రోడ్ల నిర్వహణకు, అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుందన్నారు. ఇచ్చిన అనుమతుల మేరకు ఇసుక తరలింపులో సమస్యలు లేకుండా చూడాలన్నారు. ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండేలా, స్థానికుల అవసరాలకు, ప్రభుత్వ నిర్మాణాలకు అందేలా చూడాలన్నారు.

ఇసుక తరలింపులో అక్రమాలకు తావివ్వకుండా జిల్లా యంత్రాంగం, పోలీసు యంత్రాంగం సహక రించాలని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో 46 క్వారీలకు గాను పదింటికి అనుమతి లభించిందన్నారు. మరో 36క్వారీలకు అనుమతి రావాల్సి ఉందన్నారు. ఈ వీడియో కాన్పరెన్స్‌లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర, జిల్లాకేంద్రంలో కలెక్టర్ రొనాల్డ్‌రోస్, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, మైన్స్ ఏడీ సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
 
ఆధార్ అనుసంధానం వేగవంతం చేయూలి
జిల్లాకేంద్రంలో ఓటరు కార్డుకు ఆధార్ జోడింపును త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ డి.రొనాల్డ్‌రోస్ బీఎల్‌ఓలను ఆదేశించారు. బుధవారం స్థానిక న్యూఅంబేద్కర్ భవన్‌లో నగరానికి సంబంధించి ఓటరుకార్డుకు ఆధార్ సీడింగ్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరం మినహా మిగతా 8నియోజక వర్గాలలో ఓటరు కార్డుకు సీడింగ్ పూర్తయ్యే దశలో ఉందన్నారు. నగరంలో మాత్రం కేవలం 20-30 శాతమే పూర్తి అయిందని పేర్కొన్నారు. సీడింగ్ పూర్తయితే డూప్లికేట్, బోగస్ ఓటరు కార్డులు ఏరివేయ వచ్చని చెప్పారు. దేశంలోనే మన జిల్లాను పెలైట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినందున తర్వితగతిన పూర్తిచేయూలని సూచించారు. సమావేశంలో ఐకేపీ, మెప్మా పీడీలు వెంకటేశం, సత్యనారాయణ, తహశీల్దార్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
 
పరీక్షలు  ప్రశాంతంగా నిర్వహించాలి
మార్చిలో నిర్వహించనున్న ఇంటర్మీడియేట్ పరీక్షలు ప్రశాంతంగా సాగేలా అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. తన చాంబర్‌లో ఇంటర్ పరీక్షలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. మార్చి 9 నుంచి 23 వరకు జరగనున్న పరీక్షలను పకడ్బందీగా చేపట్టాలన్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఉంటాయని, జిల్లాలో 73 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.
 
పరీక్షల సందర్భంగా అన్ని జిరాక్స్ కేంద్రాలను మూసి ఉంచాలని, పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయాలని, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్  విధించాలని, స్క్వాడ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద వైద్య సదుపాయం, అభ్యర్థులకు రవాణాకు అవసరమైన బస్సు సదుపాయాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, జేసీ రవీందర్‌రెడ్డి, అదనపు జేసీ రాజారాం, డీఆర్‌ఓ మనోహర్, ట్రాన్స్‌కో ఎస్‌ఈ ప్రభాకర్, ఆర్‌ఐఓ విజయ్‌కుమార్, డీఈఓ శ్రీనివాసాచారి, ఆర్టీసీ ఆర్‌ఓఎం రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement