‘మిడ్‌మానేరు’కు కొత్త చిక్కు! 

New issues raised in the Midmaneru Project - Sakshi

రూ.104 కోట్లు చెల్లిస్తేనే పునరావాసం, భూసేకరణ పూర్తి 

కాళేశ్వరం నిధులొస్తున్న నేపథ్యంలో నిధులకోసం ప్రభుత్వానికి నీటిపారుదల శాఖ వినతి 

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి గుండెకాయలాంటి మిడ్‌మానేరు రిజర్వాయర్‌ను పూర్తిస్థాయిలో నింపేందుకు కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి. ఇంకా మిడ్‌మానేరు రిజర్వాయర్‌ పరిధిలో పూర్తికాని భూసేకరణ, నిర్వాసితులకు అందని పునరావాసం కారణంగా పూర్తిస్థాయి నిల్వలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. మరో రూ.104 కోట్లు చెల్లిస్తే కానీ సహాయ పునరావాసం, ఇతర పనులు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు.

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ఖరీఫ్‌ సీజన్‌లోనే 150 టీఎంసీల మేర గోదావరి జలాలను తరలించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. రోజుకు 2 టీఎంసీల మేర నీటిని తరలించి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లిల అనంతరం నీరు మిడ్‌మానేరుకు చేరాలి. మిడ్‌మానేరుకు కొద్దిముందు నుంచి వరద కాల్వ ద్వారా ఒక టీఎంసీ నీరు ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకానికి, మిడ్‌మానేరు నుంచి మరో టీఎంసీ కొండపోచమ్మసాగర్‌ దిగువకు చేరాలి.

ఈ మొత్తం ప్రక్రియలో మిడ్‌మానేరు చాలా కీలకం. 25.8 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టును గత ఏడాదే 5 టీఎంసీల మేర నింపారు. వాస్తవానికి 10 టీఎంసీల వరకు నింపుదామని భావించినప్పటికీ ప్రాజెక్టు కింది ముంపు గ్రామాల్లో సహాయ పునరావాసం  పూర్తికాని కారణంగా ఈ ఏడాదికి వాయిదా వేశారు. ఈ ఏడాది పూర్తిస్థాయిలో నింపేలా పనులన్నీ పూర్త య్యాయి.  ఈ ప్రాజెక్టు కింద మొత్తంగా 13 గ్రామాలు ముంపు ప్రాంతాలుగా తేలగా, ఇందులో 10 గ్రామాల్లోని గృహాలు పూర్తిగా ముంపునకు గురవుతున్నాయి.

ఈ కారణంగా 6,829 గృహాలకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 2013 వరకు 3,451 గృహాలకు పరిహారంగా రూ.311 కోట్లు చెల్లించారు. తర్వాత ఈ ఏడాది 1,413 గృహాలకు మరో రూ.225.78 కోట్ల మేర చెల్లించారు. మరో 1,800 గృహాలకు రూ.250 కోట్ల మేర సైతం చెల్లింపులు జరిగినా.. ఇంకా ఆరేపల్లి, సంకేపల్లి గ్రామాల్లో 170 ఎకరాల మేర భూసేకరణ జరగాలి. దీంతో పాటే చీర్లవంచ గ్రామంలో ముంపునకు గురయ్యే సుమారు 200 ఇళ్లతో పాటే, మరిన్ని గ్రామాల్లో సహాయ పునరావాస ప్యాకేజీ కింద చెల్లింపులు చేయాల్సి ఉంది. ఆర్‌అండ్‌ఆర్‌ కిందే ఇంకా రూ.40 కోట్ల మేర చెల్లించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top