‘తెలంగాణ చరిత్ర–నూతన కోణం’ పుస్తకావిష్కరణ 

New angle in the Telangana history book launch - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రొఫెసర్‌ అడపా సత్యనారాయణ రచించిన ‘తెలంగాణ చరిత్ర–నూతన కోణం’ పుస్తకావిష్కరణ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌ లో జూలూరి గౌరీ శంకర్‌ అధ్యక్షతన శనివారం జరిగింది. కార్యక్రమానికి రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు, టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్‌ ఘంటా చక్ర పాణి, ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కేశవరావు మాట్లాడుతూ..‘తెలంగాణ రాష్ట్రం గురించి రాయాల్సినవి, తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. బడుగు, బలహీన వర్గాలు తెలంగాణ ఉద్యమంలో ఎలా ముందున్నారో, స్వాతంత్య్రానికి ముందు, తర్వాత తెలంగాణను విలీనం చేసే విషయాల్ని, సాయుధ పోరాటం తర్వాత కూడా భూస్వాములే పాలించి, దళితులు, మైనారిటీలను అణిచివేతకు గురిచేసిన వ్యాసాల్ని ఈ పుస్తకంలో అడపా సత్యనారాయణ చక్కగా పొందుపరిచారు’ అని కొనియాడారు.

తెలంగాణ అస్థిత్వం గురించి ఈ పుస్తకంలో పొందుపర్చడం మంచి విషయమని అల్లం నారాయణ అన్నారు. తెలంగాణ చరిత్రను టీఎస్‌పీఎస్‌సీ పోటీపరీక్షల సిలబస్‌లో పెట్టడం గొప్ప విషయం, ఇలా అయినా లక్షలాది మంది తెలంగాణ చరిత్రను తెలుసుకునే అవకాశం కలిగిందని ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. అడపా సత్యనారాయణ మాట్లాడుతూ అట్టడుగు వర్గాల గురించి, తెలంగాణలోని మిశ్రమ సంస్కృతిని తెలియజేసే విధంగా ఈ పుస్తకం రచించానని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్‌ జర్నలిస్ట్‌ అశోక్, ఉస్మానియా ప్రొఫెసర్‌ సుధారాణి, తెలంగాణ ఫిలిం ఛాంబర్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ రామ్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top