అంబేడ్కర్, జగ్జీవన్‌రాం ఆశయసాధనకు కృషి | Need to follow Ambedkar, Jagjivan Ram's aims | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్, జగ్జీవన్‌రాం ఆశయసాధనకు కృషి

Jun 11 2018 1:45 AM | Updated on Jun 11 2018 1:45 AM

Need to follow Ambedkar, Jagjivan Ram's aims - Sakshi

షాబాద్‌(చేవెళ్ల): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్, బాబూ జగ్జీవన్‌రాం ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమసమాజ నిర్మాణానికి కృషి చేస్తానని లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండల కేంద్రంతోపాటు పోతుగల్‌ గ్రామంలో అంబేడ్కర్, జగ్జీవన్‌రాం విగ్రహాలను పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అఖిల భారత కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు ప్రసాద్, మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, చంద్రశేఖర్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తదితరులతో కలసి ఆమె ఆదివారం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా షాబాద్‌లోని బహిరంగసభలో మీరాకుమార్‌ మాట్లాడుతూ.. అన్యాయాన్ని అరికట్టేందుకు అందరం ఐకమత్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత సమాజంలో దళితులను చిన్నచూపు చూస్తున్నారని, అలాంటి అసమానతలను సమాజం నుంచి దూరం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

తన తండ్రి జగ్జీవన్‌రాం ఆశయాలను పుణికి పుచ్చుకున్న తాను అణగారిన కులాల అభ్యున్నతి కోసం కృషి చేస్తానని చెప్పారు. అలాంటి మహనీయుల ఆశయాలను సాధించేందుకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేశానని అన్నారు. మహనీయుల విగ్రహాలను ప్రతిష్టించిన ఈరోజు ఎంతో శుభదినమని, ఇక్కడి ప్రజలు తనను ఎంతో ప్రేమానురాగాలతో స్వాగతించారని చెప్పారు.

మీరాకుమార్‌తోనే రాష్ట్రం ఏర్పాటు: ఉత్తమ్‌
మీరాకుమార్‌ లోక్‌సభ స్పీకర్‌గా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లు పాస్‌ అయిందని ఉత్తమ్‌ పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు దళిత ముఖ్యమంత్రిని చేస్తానని, దళితులకు మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం ఇస్తానని హామీలు ఇచ్చిన కేసీఆర్‌ వారిని మోసం చేశారని దుయ్యబట్టారు.

టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక నేరెళ్లలో దళిత రైతులపై అక్రమ కేసులు పెట్టారని, ఖమ్మంలో గిరిజనులపై దాడి చేసిన చరిత్ర వారికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో పీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్, డీసీసీ మాజీ అధ్యక్షుడు వెంకటస్వామి, పార్టీ నాయకుడు రాచమల్లసిద్ధేశ్వర్, టఫ్‌ అధ్యక్షురాలు విమలక్క తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement