
సాక్షి, మహబూబాబాద్: న్యూడెమోక్రసీ పార్టీ రాయల వర్గానికి చెందిన అజ్ఞాతదళం మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి దనసరి సమ్మయ్య అలియాస్ గోపన్నను మహబూబాబాద్ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మహబూబాబాద్‌లోని ఓ ఇంట్లో ఎన్డీ భార్య, పిల్లలతో అజ్ఞాత దళనేత గోపన్న ఉంటున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు.
ఆర్టీసీ కాలనీలోని ఓ ఇంట్లో ఆశ్రయం పొందినట్లు సమాచారం అందుకున్న డీఎస్పీ నరేశ్‌కుమార్, టౌన్ సీఐ జబ్బార్, ఎస్‌ఐలు తిరుపతి, రవీందర్ పోలీసు సిబ్బందితో సదరు ఇంటిపై దాడి చేశారు. గమనించిన గోపన్న గోడ దూకి పారిపోయాడు. దీంతో ఎస్పీ కోటిరెడ్డి, అడిషనల్ ఎస్పీ గిరిధర్ రంగంలోకి దిగారు. ఆయా రోడ్లపై వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలో ఓ ఆటోలో గోపన్న వెళ్తుండగా జమాండ్లపల్లి వద్ద అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.