ఉపాధి ఉత్తిమాటేనా? | National Rural Employment Guarantee Scheme in karimnagar | Sakshi
Sakshi News home page

ఉపాధి ఉత్తిమాటేనా?

Nov 21 2017 2:09 AM | Updated on Nov 21 2017 2:09 AM

National Rural Employment Guarantee Scheme in karimnagar - Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: పేదల కడుపు నింపడం, వలసల నివారణ కోసం చేపట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లక్ష్యం నీరుగారుతోంది. కూలీలకు ఉన్నచోటే పనులు కల్పించి జీవనోపాధికి భరోసా ఇవ్వాల్సిన ఈ పథకం అమలు పేరుగొప్ప ఊరు దిబ్బలా మారుతోంది. సరైన ఉపాధి లభించక గ్రామీణ ప్రాంతాల ప్రజలు అవస్థలు పడుతున్నారు.

ఈ ఏడాది ఉపాధి హామీ పనుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 61.42 లక్షల మంది నమోదు చేసుకోగా.. 41.49 లక్షల మందికి మాత్రమే, అదీ అరకొరగా పనులు దొరికాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు కూలీ పని కోసం ఎంతదూరమైనా వెళుతున్నారు. అలా పత్తి ఏరే పని కోసం కరీంనగర్‌ జిల్లా చామనపల్లి నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నర్సక్కపల్లెకు ఆటోలో వెళుతున్న కూలీలు.. ప్రమాదంలో మరణించారు.

భరోసా ఇవ్వని ‘ఉపాధి’
ఉపాధి హామీ చట్టం ప్రకారం కూలీలకు ఏడాదిలో కనీసం 100 రోజుల పాటు పని కల్పించాలి. కానీ ఇది అమలు కావడం లేదు. ఈ ఏడాది ఉపా«ధి హామీ కింద పనుల కోసం 61.42 లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అందులో ఇప్పటివరకు 41.49 లక్షల మందికి మాత్రమే, అదీ అరకొరగా పనులు లభించాయి. అంటే సుమారు 20 లక్షల మందికి మొత్తానికే ‘ఉపాధి’పనులు లభించలేదు. ఇక పని దొరికినవారిలోనూ హామీ మేరకు ‘వంద రోజుల పని’పూర్తి చేసుకున్న కుటుంబాలు 1,31,103 మాత్రమే. ముఖ్యంగా పాత కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఉపాధి హామీ పనులు కూలీలకు భరోసా ఇవ్వడం లేదు.

తగిన వేతనమూ దిక్కులేదు
పని లభించని ఉపాధి కూలీల మాటేమోగానీ.. పనులకు వెళ్లినవారికీ తగిన వేతనం అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రోజుకు కూలీ సగటున రూ.194కు తగ్గకుండా చూడాలి. కానీ ఈ ఏడాది ఇప్పటివరకు ఉపాధి కూలీలకు అందిన సగటు రోజు కూలీ రూ.139.8 మాత్రమే. దీంతో కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు జిల్లాల్లో కూలీలకు రెండు నెలలుగా సొమ్ము చెల్లించలేదని చెబుతున్నారు.


ఉపాధి హామీ అమలు తీరు..
జారీ అయిన మొత్తం
జాబ్‌కార్డులు: 66.84 లక్షలు
ఈ ఏడాది పనుల కోసం నమోదు చేసుకున్న వారు: 61.42 లక్షలు
పనిపొందినవారు: 41.49 లక్షలు
100 రోజుల పని పూర్తి చేసిన కుటుంబాలు: 1,31,103
అందాల్సిన కూలీ: రూ.194
సగటున లభించిన కూలీ: రూ.139.80

పని లేదు.. పైసలూ రాలేదు
‘‘ఈ ఏడాది ఉపాధి హామీ పనులు సరిగా దొరకలేదు. దీంతో పత్తి ఏరేందుకు వెళ్తున్నా. ఉపాధి హామీలో చేసిన పనులకు ఇప్పటివరకు డబ్బులు రాలేదు. కుటుంబం గడవడం కష్టంగా ఉంది. అధికారులు చొరవ చూపి ఊళ్లోనే ఉపాధి హామీ పనులు జరిగేలా చూడాలి..’’         – గోపరవేన రాజమ్మ, ఉపాధి కూలీ,  దమ్మక్కపేట కరీంనగర్‌ జిల్లా

దూరం పోతే.. ప్రాణాలు పోతున్నాయి
‘‘ఉపాధి పని దొరకక పత్తి ఏరేందుకు, వేరే కూలీ పనుల కోసం దూరంగా ఉన్న ఊళ్లకు పోవాల్సి వస్తోంది. పనికోసం తీసుకెళ్లేవారు.. ఆటోలు, ట్రాక్టర్లలో ఇష్టం వచ్చినంత మందిని ఎక్కించుకుని తీసుకెళుతున్నారు. దాంతో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి..’’ – ఎన్‌.సాంబశివారెడ్డి, కూలీ, పెద్దపాపయ్యపల్లి, కరీంనగర్‌ జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement