పట్టణం ఎవరికో?

Municipal Elections 2020 Results Today - Sakshi

 నేడు మున్సిపల్‌ కౌంటింగ్‌

తేలనున్న అభ్యర్థుల భవితవ్యం.. తమదే విజయమంటూ  అధికార పక్షం ధీమా

30% స్థానాలు తమవే అంటున్న కాంగ్రెస్‌

కార్పొరేషన్లలో ముందంజలో ఉంటామంటున్న కమలనాథులు

ఎంఐఎంకు తగిన ప్రాతినిధ్యం లభించేనా?

క్యాంపులకు ఏర్పాట్లు చేసుకుంటున్న రాజకీయపక్షాలు

సాక్షి, హైదరాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. ఈనెల 22న రాష్ట్రవ్యాప్తంగా 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ శనివారం ఉదయం మొదలు కానుంది. పదింటికల్లా తొలి ఫలితం వెలువడనుంది. ఈ నేపథ్యంలో ఫలితాలపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కనిపిస్తోంది. తమ తమ అంచనాల మేరకు ఫలితాలు వస్తాయా రావా అన్న దానిపై పార్టీలు ఆసక్తితో ఎదురుచూస్తున్నాయి. పోలింగ్‌ జరిగిన సరళిని బట్టి గతంలో జరిగిన అన్ని ఎన్నికల ఫలితాల తరహాలోనే పురపోరులోనూ టీఆర్‌ఎస్‌కు స్పష్టమైన ఆధిక్యం వస్తుందన్న ధీమా ఆ పార్టీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అటు మున్సిపాలిటీలు, ఇటు కార్పొరేషన్లు అన్నింటినీ తామే కైవసం చేసుకుంటామనే విశ్వాసం ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇక, ప్రతిపక్షాల విషయానికి వస్తే గట్టి పోటీ ఇచ్చామనే అంచనాలో కాంగ్రెస్‌ ఉంది. 30 శాతం స్థానాల్లో విజయం సాధిస్తామని చెబుతోంది. బీజేపీ కూడా కార్పొరేషన్లలో అందరి అంచనాలకు మించి ఫలితాలొస్తాయనే ఆశాభావంతో ఉంది. ఎంపిక చేసుకుని పోటీచేసిన స్థానాల్లో తమకు కూడా తగిన ప్రాతి నిధ్యం లభిస్తుందని, గత మున్సిపల్‌ ఎన్నికల కంటే మంచి ఫలితాలు సాధిస్తామని ఎంఐఎం చెబుతుండగా, వామపక్షాలు, టీజేఎస్‌ తదితర పార్టీలు అరకొర సీట్లపై ఆశలు పెట్టుకున్నాయి. 

అన్ని సర్వేలదీ అదే మాట 
మున్సిపోల్స్‌ ఫలితాలు నేటి మధ్యాహ్నానికి అధికారికంగా వెల్లడి కానుండగా, పోలింగ్‌ పూర్తయిన రోజే అన్ని రాజకీయ పక్షాలు ఓ అంచనాకు వచ్చాయి. ఈ ఎన్నికల్లో కూడా అధికార టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధిస్తుందని ప్రీపోల్, పోస్ట్‌పోల్‌ సర్వేలు, ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడిస్తున్నాయి. ఈనెల 27న జరగనున్న మున్సిపల్‌ చైర్మన్లు, కార్పొరేషన్‌ మేయర్ల ఎన్నికపై అధికారి పార్టీ అప్పుడే దృష్టి సారించింది. దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో తమదే పైచేయి అవుతుందని, ఒకట్రెండు స్థానాలు తగ్గిన చోట్ల ఎక్స్‌అఫీషియో ఓట్ల ఆసరాతో పుర పీఠాలను దక్కించుకోవాలని యోచిస్తోంది. ఎన్నికలు జరిగిన 9 కార్పొరేషన్లను సులువుగా కైవసం చేసుకుంటామనే ధీమా కూడా ఆ పార్టీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. పల్లెల నుంచి కొత్తగా మున్సిపాలిటీలుగా మారిన అన్ని స్థానాల్లో తమదే విజయమని గులాబీ నేతలు ఘంటాపథంగా చెబుతున్నారు. కాంగ్రెస్‌ కూడా టీఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చామనే ధీమాలో ఉంది. పట్టణ ప్రజలు తమ వైపు మొగ్గుచూపారని, ఊహించని ఫలితాలు వస్తాయని ఆ పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నా.. 30 శాతం ఓట్లు, సీట్లు తమ ఖాతాలో పడతాయనే ఆశతో టీపీసీసీ నేతలున్నట్లు తెలుస్తోంది.

నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఖమ్మంతో పాటు ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉన్న స్థానాల్లో తాము మెరుగైన ఫలితాలు సాధిస్తామని ఆ పార్టీ నేతలు లెక్కలు కట్టుకుంటున్నారు. ఇక, బీజేపీ విషయానికి వస్తే కమలనాథులు కూడా ఈసారి తమకు వచ్చే ఓటు బ్యాంకు భవిష్యత్‌ రాజకీయ మార్పులకు పునాది అవుతుందని చెబుతున్నారు. మున్సిపాలిటీల్లో ఎలా ఉన్నా కార్పొరేషన్లలో కాంగ్రెస్‌ కన్నా ఎక్కువ ఓట్లు, సీట్లు వస్తాయని ఆ పార్టీ నేతలంటున్నారు. ఎంఐఎం కూడా నిజామాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాల్లో మంచి ఓట్లు సాధిస్తామని, గతంలో తమకు మున్సిపాలిటీల్లో ఉన్న ప్రాతినిధ్యం కన్నా ఈసారి పెరుగుతుందని అంచనా వేస్తోంది. మొత్తమ్మీద టీఆర్‌ఎస్‌ అనుకూల ఫలితాలే వస్తాయనే అంచనాల మధ్య నేటి ఉదయం ప్రారంభం కానున్న కౌంటింగ్‌ ప్రక్రియ మధ్యాహ్నానికి ముగిసే అవకాశాలుండటంతో సాయంత్రం 4 గంటల కల్లా కొత్త పురపాలకులపై స్పష్టత రానుంది. 

కార్పొరేషన్లలో ఏమవుతుంది? 
ఈనెల 22న ఎన్నికలు జరిగిన 9 కార్పొరేషన్లలో ఫలితం ఎలా ఉంటుందన్న దానిపై రాష్ట్రంలోని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. అధికార టీఆర్‌ఎస్‌ అనుకూల ఫలితం దాదాపు ఖాయమే అయినా ఈ కార్పొరేషన్లలో కాంగ్రెస్, బీజేపీలలో ఎవరిది పైచేయి అవుతుందన్నది ఆసక్తి కలిగిస్తోంది. 20–22 శాతం చొప్పున ఓట్లు ఆ రెండు పార్టీలకు వస్తాయనే అంచనా ఉండగా, కార్పొరేషన్లలో కూడా కాంగ్రెసే రెండో స్థానంలో ఉంటుందని కొన్ని సర్వేలు చెపుతుండగా, మరికొన్ని సర్వేలు కాంగ్రెస్‌ కన్నా స్వల్ప ఆధిక్యత బీజేపీకే వస్తుందని అంటున్నాయి. రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్‌ జిల్లాల్లోని కార్పొరేషన్లలో బీజేపీ మంచి ప్రభావం చూపిందనే లెక్కలు చూపిస్తున్నాయి. అయితే, కాంగ్రెస్‌ వర్గాలు కూడా సర్వేల మాట ఎలా ఉన్నా కార్పొరేషన్లలోనూ బీజేపీ కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని, బీజేపీకి పడే ఓట్లు టీఆర్‌ఎస్‌ నుంచే వెళ్తాయి కాబట్టి తమకు లబ్ధి కలుగుతుందని అంచనా వేస్తున్నాయి. మొత్తంమీద కార్పొరేషన్లతో పాటు కొన్ని మున్సిపాలిటీల్లో బీజేపీకి ఎన్ని ఓట్లు,సీట్లు వస్తాయి.. ఆ పార్టీకి వచ్చే ఓట్లు టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లలో ఎవరికి నష్టం చేకూరుస్తాయన్నది భవిష్యత్‌ లె లంగాణ రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందన్నది రాజకీయ విశ్లేషకుల మాట.  

క్యాంపులకు వెళ్దాం..చలో చలో 
ఫలితాలు రాక ముందే క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. అధికార పార్టీతో పాటు కాంగ్రెస్, బీజేపీలు తమ అభ్యర్థులతో ఇప్పటికే కొన్ని చోట్ల క్యాంపులకు వెళ్లిపోగా, నేటి ఫలితాల ను బట్టి ‘క్యాంపులు’ ముమ్మరం కానున్నాయి.  హైదరాబాద్‌ శివార్లలోని రిసార్టులు, వైజాగ్‌తో పాటు గోవా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాలను దీనికోసం ఎంచుకుంటున్నారు. ఇప్పటికే టూర్‌ ప్యాకేజీలూ సిద్ధం చేసుకోగా, ఫలితాలు వెలువడ గానే గెలిచిన కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ను తీసుకెళ్లి ఈనెల 27న మేయర్లు, చైర్‌పర్సన్ల ఎన్నిక కార్యక్రమానికి వచ్చేలా పార్టీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఈ క్యాంపులకయ్యే ఖర్చును భరించేందుకు కూడా చైర్మన్, మేయర్‌ ఆశావాహులు వెనుకాడకపోవడంతో రాష్ట్రంలోని 50 శాతానికి పైగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో గెలిచిన వారు క్యాంపులకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top